06-11-2025 01:21:35 AM
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఈ నెల 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “నిర్మాతగా ఎన్నో సినిమాలు చేశా, చేస్తున్నా. కోట్లు సంపాదించా.
అయితే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ద్వారా నేను సంపాదించాలనుకున్నది డబ్బు కాదు. సంతృప్తి. ఈ సినిమా నిర్మించాననే విషయం ఎంతో సంతృప్తినిస్తోంది. మనకు తెలిసిన కొన్ని చెప్పలేని నిజాలను సినిమా మాధ్యమం ద్వారా చెప్పాలనే భావన ఈ కథ విన్నప్పుడు కలిగింది. ఎన్ని పాటలున్నాయి, ఎన్ని జోక్స్ ఉన్నాయి, ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది అని చూసే సినిమా కాదిది. అలా చూస్తే ఈ సినిమా చేయలేం. మన అక్క, చెల్లి, పిన్ని వాళ్ల మనసుల్లో ఏముంటుంది, ఎలాంటి కోర్కెలు ఉంటాయి అనుకుని మూవీ చూడాలి. ఈ సినిమా చూశాక చాలామంది ఆ రాత్రి నిద్రపోరు.
అంతగా ఈ మూవీ వారిని వెంబడిస్తుంది. ప్రతి ఫ్యామిలీలో ప్రతి పర్సన్ ఈ మూవీలోని కథతో రిలేట్ అవుతారు. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వడానికి క్రిటిక్స్ కూడా ఇబ్బంది పడతారు. రష్మిక ఈ సినిమాలో జీవించేసింది. దీక్షిత్ నటన చూసి ఇతను తెలుగులో స్థిరపడతాడు, ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహించాలి అనిపించింది” అన్నారు. హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. “ఈ సినిమా షూటింగ్ టైమ్‌లోనే అల్లు అరవింద్ నాకు మరో మూవీకి అడ్వాన్స్ ఇచ్చారు.. అది అడ్వాన్స్‌గా భావించను.. ఆయన నాకు ఇచ్చి ధైర్యం అనుకుంటా.
నేను ఈ సినిమాలో బాగా పర్‌ఫార్మ్ చేశానంటే అందుకు రష్మిక కారణం. మా సినిమా చూస్తూ థియేటర్‌లో ఒక్క విక్రమ్ మారినా మా ప్రయత్నం సక్సెస్ అయినట్లే” అని చెప్పారు. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. “ది గర్ల్‌ఫ్రెండ్’ నా కెరీర్‌లో ఒక బ్యూటిఫుల్ జర్నీగా మిగిలిపోతుంది. దీక్షిత్, రష్మిక పర్‌ఫార్మెన్స్‌ను ప్రేక్షకులు మర్చిపోలేరు. దీక్షిత్ సక్సెస్ అయితే అది మాలాంటి మేకర్స్ అందరికీ సక్సెస్ వచ్చినట్లే. రష్మిక చేసిన పర్‌ఫార్మెన్స్ ఈ దశాబ్దంలో ఒక ఫీమేల్ యాక్టర్ తెలుగులో చేసిన బెస్ట్ పర్‌ఫార్మెన్స్‌గా నిలుస్తుంది. ఆమె ఎన్నో అవార్డులు, రివార్డులకు అర్హురాలు” అని తెలిపారు.
నిర్మాత విద్య మాట్లాడుతూ.. “మనం జీవితంలో ఎక్స్‌పీరియన్స్ చేస్తే గానీ చెప్పలేం. ఎన్నో ఫీలింగ్స్ ఉన్నా మాటల్లో వివరించలేం. మనం అడగ లేని ప్రశ్నలూ ఉంటాయి. అలాంటి అన్నింటికీ ఈ సినిమా సమాధానంగా నిలుస్తుంది” అన్నారు. నిర్మాత ధీరజ్ మాట్లాడుతూ.. “సినిమానే ప్రపంచంగా జీవించే డైరెక్టర్ రాహు ల్. ఆయన పర్సనల్ లైఫ్‌లో కొన్ని ఘటనలు జరిగాయి. అయినా సినిమా వర్క్ ఏరోజూ ఆపలేదు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ ఛోటా కే ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్లు ప్రశాంత్ విహారి, హేషమ్ అబ్దుల్ వాహాబ్, చిత్రబృందం మాట్లాడారు.