23-11-2025 01:20:06 AM
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్ర రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ చేరిన నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 8 విచారణ ముగియడంతో మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలైన దానం నాగేందర్, కడియం శ్రీహరి అంశంలో ఉత్కంఠ పెరుగుతున్నది.
పార్టీ ఫిరాయింపుల విషయంలో ఈ నెల 23వ తేదీలోగా సమాధానాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కడియం శ్రీహరి, దానం నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ గడువు నేటితో ముగుస్తుండటంతో తనకు మరింత గడువు ఇవ్వాలని కడియం శ్రీహరి గదువు కోరారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ సైతం అదే బాటలో గడువు కోరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
పార్టీ ఫిరాయింపుల విచారణ ఎదుర్కోవడం కంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లడమే మేలు అనే అభిప్రాయాన్ని దానం తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దానం తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది వేచి చూడాలి. దీనికి తోడు తాజాగా ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకున్నది.
శనివారం శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో నిన్న ఏఐసీసీ పెద్దలు, న్యాయ నిపుణులతో సమావేశమైన దానం తాజాగా శ్రీధర్ బాబుతో సమావేశం కావడంతో దానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.
పరిస్థితుల దృష్ట్యా తాను రాజీనామా చేయాల్సిన పరిస్థితే వస్తే తిరిగి తనకే టికెట్ ఇవ్వాలని ఏఐసీసీ పెద్దలను దానం కోరినట్లు తెలుస్తోంది. ఆ విషయాలనే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో దానం ఇవాళ చర్చించినట్లు సమాచారం. దానం నాగేందర్ త్వరలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
రాజీనామా చేస్తాననలేదు: కడియం శ్రీహరి
మహబూబాబాద్(విజయక్రాంతి): ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని ఎక్కడా చెప్పలేదని, ఫిరాయింపు అంశంలో సమాధానం ఇవ్వ డానికి మరికొంత గడువు కావాలని స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. శనివారం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. ఫిరాయిం పు ఫిర్యాదుల మేరకు స్పీకర్ తనకు ఇచ్చిన నోటీసుకు వివరణ ఇవ్వడానికి న్యాయ నిపుణులతో మాట్లాడటానికి మరికొంత సమయం కావాలని స్పీకర్‌ను విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారని చెప్పారు.
స్పీకర్ తదుపరి ఇచ్చే గడువు లోపల తాను తప్ప కుండా వివరణ ఇస్తానని చెప్పారు. తాను రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తానని వస్తున్న ప్రచారం పూర్తిగా మీడి యా సృష్టి అని, తాను ఎక్కడ కూడా ఆ విధమైన ప్రకటన చేయలేదని ఆయన చెప్పారు. ఒకవేళ ఉపఎన్నిక వస్తే తప్పకుండా తను తిరిగి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం, అధికార పార్టీతో కలిసి పనిచేస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి మేలు చేయడానికి అవకాశం ఉండటంతో, తాను ప్రభుత్వం, అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు.
స్పీకర్ ప్రకటించే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, ఒకవేళ ఉప ఎన్నిక వస్తే తాను కచ్చితంగా తిరిగి పోటీ చేస్తానని, పోటీ చేయకపోతే తాను భయపడ్డట్టు భావిస్తారని, తాను ఎన్నటికీ ఎవరికి భయపడే ప్రసక్తి లేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.