23-11-2025 01:13:39 AM
ఫ్యూచర్ సిటీలో సువిశాల ప్రాంగణం.. భారీ వేదిక
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌కు తుది మెరుగులు
25వ తేదీ నుంచి విభాగాల వారీగా సీఎం సమీక్షలు
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి) : డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ఏరియాలో నిర్వహించే రెండు రోజుల వేడుకలను రెండేండ్ల విజయోత్సవాలుగా జరపాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సీఎంఓ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌తో సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రితోపాటు సీఎంవో అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినందున, రెండేండ్ల విజయోత్సవాలను ప్రతిబింబించేలా ఫ్యూచర్ సిటీలో విశాలమైన ప్రాంగణంలో భారీ వేదిక ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
గ్లోబల్ సమ్మిట్ అందరినీ ఆకట్టుకునే అంతర్జాతీయ స్థాయి ఉత్సవాన్ని తలపించాలన్నారు. డిసెంబర్ 8వ తేదీ, తొలి రోజున ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విజయాన్ని చాటి చెప్పాలన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు జరగాలన్నారు.
9వ తేదీన రెండో రోజున తెలంగాణ భవిష్యత్తు దార్శనికతను, భవిష్యత్తు ప్రణాళికలను పొందుపరిచిన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని విభాగాలు తమ భవిష్యత్తు లక్ష్యాలన్నీ కళ్లకు కట్టించే ఆడియో వీడియో ప్రదర్శనలు, ప్రజంటేషన్లు తయారు చేసుకోవాలని సీఎం సూచించారు.
అతిథులకు కట్టుదిట్ట భద్రత
దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, అన్ని రంగాల్లో పేరొందిన పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని అధికారు లను ఆదేశించారు. వేడుకలకు వచ్చిన అతిథులకు తగిన వసతి సదుపాయాలతో పాటు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సీఎం ఆదేశించారు. ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని, అన్ని విభాగాలు సమన్వయంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలని అన్నారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటంతో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు గ్లోబల్ సమ్మిట్లో కీలకంగా పాలుపంచుకోవాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను దిశానిర్దేశం చేసే ఈ డాక్యుమెంట్లో పొందుపరిచిన అంశాలపై సంబంధిత విభాగాలతో ఈనెల 25 నుంచి వరుసగా సమీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు.
అభివృద్ధిలో కీలకమైన రంగాలు, అందులో పాలుపంచుకునే అనుసంధాన విభాగాలన్నింటితో ఒక్కో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు రెండేండ్ల ప్రగతి, తెలంగాణ రైజింగ్ 2047లో ఆయా విభాగాల పాత్రపై ప్రధానంగా సమీక్ష జరుపుతామన్నారు. వివిధ విభాగాల అధికారులతో నిర్వహించే సమీక్షల్లో వచ్చే విలువైన సలహాలు, నిర్దిష్టమైన సూచనలను పొందుపరిచి డాక్యుమెంట్ కు తుదిరూపం ఇస్తామని అభిప్రాయపడ్డారు.