calender_icon.png 23 November, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిమవీరుల త్యాగాలు గ్రేట్

23-11-2025 01:14:03 AM

  1. భారత్-చైనా సరిహద్దు రక్షణలో సేవలు అమోఘం
  2. పర్వతారోహణ సహా అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో ఐటీబీపీ అదుర్స్
  3. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): మంచు పర్వతాల్లో, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ)లు దేశానికి చేస్తున్న సేవలు, త్యాగాలు గ్రేట్ అని, అవి వెలకట్టలేనివని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. 3,488 కి.మీల పొడవైన భారత్-చైనా సరిహద్దు రక్షణలో ఐటీబీపీ సిబ్బంది సేవలు అమోఘమని అభివర్ణించారు. ‘సివిక్ యాక్ష న్ ప్రోగ్రామ్’ కింద స్థానిక ప్రజలకు స్వయం ఉపాధి శిక్షణనివ్వడం భేష్ అని అభినందించారు.

పర్వతారోహణ సహా అడ్వెంచర్ స్పోర్ట్స్‌లోనూ ఐటీబీపీ అద్భుతమైన ప్రతిభను కనబరుస్తోందని చెప్పారు. ఐటీబీపీ 64వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ 15వ ఐటీబీపీ బెటాలియన్ కేంద్రంలో నిర్వహించిన పరేడ్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ  కార్యక్రమానికి జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఐటీబీపీ డీజీ ప్రవీణ్ కుమార్ తోపాటు పలువురు ఐజీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఉదయం నేరుగా ఐటీబీపీ అమరవీరుల స్మారక స్థలికి వెళ్లిన కేంద్రమంత్రి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఐటీబీపీ సిబ్బందికి నివాళి అర్పించారు. నూతనంగా నిర్మించిన ఐటీబీపీ భవనాలకు, బ్యారక్‌లను రిమోట్ ద్వారా ప్రారంభించారు. అనంతరం  ఐటీబీపీ పరేడ్ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ ప్రసంగించారు. జీరో నుంచి మైనస్ 45 డిగ్రీల వరకు పడిపోయే ఉష్ణోగ్రతల్లో హిమాలయ సరిహద్దుల్లో హిమ వీరుల సాహసం, సహనం, అంకితభావం దేశానికి గర్వకారణమన్నారు.

మీ త్యాగం, ధైర్యం, నిబద్ధత వెలకట్టలేనివని పేర్కొన్నారు. 1962లో ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు ఐటీబీపీ దేశంలోని 3,488 కి.మీ. పొడవైన భారత్-చైనా సరిహద్దును కాపాడటంలో అపూర్వ సేవలు అందించిందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లను ఎదుర్కోవడంలోనూ, జమ్మూ- కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ఐటీబీపీ వీరోచిత ధైర్యాన్ని ప్రదర్శించిందని పేర్కొన్నారు.