23-11-2025 12:24:53 AM
డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట ఒకేసారి 37 మంది మావోయిస్టుల లొంగుబాటు
తెలంగాణ కమిటీ సభ్యుడు ఆజాద్ నేతృత్వంలో ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి
వారిలో ముగ్గురు రాష్ర్ట కమిటీ, ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు
రూ.1.41 కోట్ల రివార్డు అందజేసిన డీజీపీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 22 (విజయక్రాంతి): మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగి లింది. దశాబ్దాల తరబడి దండకారణ్యంలో విప్లవ పంథాలో నడిచిన అగ్రనేతలు, దళ సభ్యులు.. తెలంగా ణ మావోయిస్టు రాష్ర్ట కమిటీ సభ్యుడు, మూడు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న కొయ్యాడ సాంబయ్య అలి యాస్ ఆజాద్ నేతృత్వంలో శనివారం 37 మంది డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట ఆయుధాలు వీడి లొంగిపోయారు.
వీరిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు కాగా, మిగిలిన 34 మంది చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారు. గత 11 నెలల్లో తెలంగాణ పోలీసుల ఎదుట రికార్డు స్థాయిలో 465 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ప్రస్తుతం తెలంగా ణకు చెందిన మరో 59 మంది అజ్ఞాతంలో ఉన్నారని సమాచారం. కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియస్ గణపతి, మల్లోజుల రాజిరెడ్డి అలియాస్ సంగ్రాం, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, పాక హనుమంతు అలియాస్ గణేష్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, వీరితో పాటు మరో 10 మంది రాష్ర్ట కమిటీ సభ్యులు ఉన్నట్టు సమాచారం.
శనివారం లొంగిపోయిన 37 మందిలో ముగ్గురు రాష్ర్ట కమిటీ సభ్యులు ఉన్నారు. వారిలో కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాసి నారాయణ అలియాస్ ర మేశ్, సోమ్‌దా అలియాస్ ఎర్ర ఉన్నారు. ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు, తొమ్మి ది మంది ఏరియా కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులు ఉన్నారు.
మొత్తంగా ముగ్గురు తెలంగాణకు చెందిన వారు కాగా, మిగిలిన 34 మంది చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెం దిన వారని డీజీపీ వెల్లడించారు. ఆజాద్‌పై రూ.20 లక్షలు, అప్పాసి నారాయణపై రూ.20 లక్షల రివార్డు ఉంది. మొత్తంగా 37 మందికి కలిపి రూ.1.41 కోట్ల రివార్డును చెక్కుల రూపంలో అందించారు. అదనంగా తక్షణ ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.25 వేల నగదును అందజేశారు. లొంగిపోయినవారు 303 రైఫిల్స్, జీ-3 రైఫిల్స్, ఎస్‌ఎల్‌ఆర్‌లు, ఏకే-47 తుపాకులు అప్పగించారు.
పరిస్థితులు బాగోలేవు: ఆజాద్
లొంగుబాటు అనంతరం మీడియా స మావేశంలో ఆజాద్ మాట్లాడారు. ‘ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరనే విషయం కూడా మాకు తెలియదు. కిందిస్థాయి క్యాడర్‌కు సమాచారం అందడంలేదు. రాష్ర్ట కమిటీ బాధ్యతలను దామోదర్ చూస్తున్నారు. ఆయనతో పాటు వెంకన్న కూడా కీలకంగా ఉన్నారు. అనారోగ్యం, వృద్ధాప్యం, పార్టీలో సిద్ధాంతపరమైన గందరగోళం నడుమ అడవిలో ఉండటం కంటే.. బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతున్నా. నేను పార్టీకి సమాచారం ఇచ్చే బయటకు వచ్చాను’ అని ఆజాద్ తెలిపారు.