calender_icon.png 23 November, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సున్నం చెరువు సుందరీకరణకు మార్గం సుగమం

23-11-2025 01:15:22 AM

  1. వివాదానికి, తప్పుడు ప్రచారానికి తెర

గుడి, చిల్లా తరలింపునకు ఇరువర్గాల అంగీకారం

ఎఫ్‌టీఎల్ నుంచి గట్టుపైకి మారనున్న ప్రార్థనా మందిరాలు

హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్చలు సఫలం

హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 22 (విజయక్రాంతి) : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) మాదాపూర్, బోరబండ సరిహద్దుల్లోని సున్నం చెరువు పునరుద్ధరణ పనులకు అడ్డంకిగా ఉన్న మతపరమైన కట్టడాల తరలింపు వ్యవహారాన్ని అత్యంత సామరస్యపూర్వకంగా పరిష్కరించింది.

చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం, ముస్లింల ప్రార్థనా స్థలమైన చిల్లాను అక్కడి నుంచి తరలించేందుకు ఇరు వర్గాల ప్రజలు అంగీకారం తెలిపారు. హైడ్రా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొదటి విడత చెరువుల పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా ఆరు చెరువులను ఎంపిక చేయగా, అందులో సున్నం చెరువు కూడా ఉంది.

అయితే, ఈ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి, దానికి సమీపంలోనే ఒక చిల్లా ఉండటంతో వీటి తరలింపుపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల చర్చలు, వదంతులు వినిపించాయి. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం హైడ్రా కార్యాలయంలో స్థానికులతో, ఇరు వర్గాల పెద్దలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వారికి వివరించారు. చెరువుల రక్షణ, పునరుద్ధరణ ఆవశ్యకతను తెలియజేస్తూనే.. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఈ రెండు ప్రార్థనా మందిరాలను తొలగించడం కాకుండా, గౌరవప్రదంగా చెరువు గట్టు వైపునకు బండ పైకి సురక్షితంగా తరలిస్తామని భరోసా ఇచ్చారు.

కమిషనర్ చొరవ, వివరణకు స్పందించిన స్థానికులు, ఇటు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, అటు చిల్లాను తరలించేందుకు తమ సంపూర్ణ సమ్మతిని తెలిపారు. దీంతో ఈ సున్నితమైన అంశానికి, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సామరస్యపూర్వకంగా తెరపడినట్లయింది.