15-08-2024 12:00:00 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 14: గ్లెన్‌మార్క్ ఫార్మా నికరలాభం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రెట్టింపై రూ.340 కోట్లకు చేరింది. భారత్, యూరప్‌ల్లో అమ్మకాలు వృద్ధిచెందడం, వడ్డీ వ్యయాలు తగ్గడం లాభాల వృద్ధికి దోహదపడిందని బుధవారం గ్లెన్‌మార్క్ తెలిపింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ.173 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఈ క్యూ1లో కంపెనీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.3,244 కోట్లకు చేరగా, ఇబిటా 34.5 శాతం పెరిగి రూ.588 కోట్లను అందుకున్నది. భారత్‌లో వ్యాపారం రూ.1,196 కోట్లకు చేరిందని, కీలకమైన కార్డియాక్ థెరపీలో మార్కెట్ వాటా పెరిగిందని కంపెనీ పేర్కొంది. ఉత్తర అమెరికాలో అమ్మకాలు రూ.781 కోట్లకు తగ్గగా, యూరప్ వ్యాపారం 21 శాతం వృద్ధితో రూ.696 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13,500 కోట్ల నుంచి రూ.14,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తామని గ్లెన్‌మార్క్ గైడెన్స్ ఇచ్చింది.