calender_icon.png 11 July, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలుగులో ఐటీ షేర్లు

15-08-2024 12:00:00 AM

స్వల్పంగా పెరిగిన సూచీలు

ముంబై, ఆగస్టు14: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లో అరశాతం వరకూ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలతో ప్రపంచ ట్రెండ్‌కు అనుగుణంగా ఐటీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. దీనితో రెండు రోజుల సూచీల పతనానికి బుధవారం బ్రేక్‌పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 150 పాయింట్ల లాభంతో 79,000 పాయింట్ల స్థాయి ఎగువన 79,105 పాయింట్ల వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 5 పాయింట్లు లాభపడి  24,144  పాయింట్ల వద్ద నిలిచింది. ప్రపంచ మార్కెట్లు జోరు చూపించినప్పటికీ, దేశీయ మార్కెట్లు పరిమితశ్రేణిలో కదలాడాయని, ఫెడ్ నుంచి సరళ ద్రవ్య విధానాన్ని అంచనా వేస్తూ ఐటీ ఇండెక్స్ పెరిగిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యోలు పెరగ్గా, షాంఘై, హాంకాంగ్‌లు తగ్గాయి. యూరప్ మార్కెట్లు పాజిటివ్‌గా ముగిసాయి. 

మైనింగ్ షేర్ల భారీ పతనం

మైనింగ్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాలకు 2005 ఏప్రిల్ నుంచి రాయల్టీలను చెల్లించాలంటూ రూలింగ్ ఇవ్వడంతో ఈ షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. ఎన్‌ఎండీసీ 6 శాతం, హిందుస్థాన్ కాపర్ 4 శాతం, నాల్కో 2.7 శాతం చొప్పున పడిపోయాయి. మైనింగ్ కార్యకలాపాలతో సంబంధమున్న పవర్, ఉక్కు కంపెనీలు సైతం 3 శాతం వరకూ తగ్గాయి.

టీసీఎస్ టాప్ గెయినర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టీసీఎస్ 2.3 శాతం పెరిగి రూ.4,290 వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ 2 శాతం వర కూ పెరిగాయి. మరోవైపు అల్ట్రాటెక్ సిమెం ట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు 3.5 శాతం వరకూ తగ్గాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా ఐటీఇండెక్స్ 1.41 శాతం పెరిగింది. టెక్నాలజీ ఇండె క్స్ 1.33 శాతం పెరగ్గా, కన్జూమర్  డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.13 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 0.90 శాతం చొప్పున పెరిగాయి. బ్యాంకెక్స్ 1.45 శాతం తగ్గింది. కమోడిటీస్, మెటల్, టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, మెటల్, పవర్, రియల్టీ, సర్వీసుల సూచీలు క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.41 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.57 శాతం చొప్పున క్షీణించాయి. 

నేడు మార్కెట్లకు సెలవు

స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం స్టాక్ మార్కెట్లకు సెలవు.