15-08-2024 12:00:00 AM
14 కోట్ల షేర్ల అమ్మకం
న్యూఢిల్లీ, ఆగస్టు 14: హిందుస్థాన్ జింక్‌లో విక్రయించే వాటా పరిమాణాన్ని వేదాంత లిమిటెడ్ పెంచింది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో 2.6 శాతం హింద్ జింక్ వాటాను (11 కోట్ల షేర్లు) విక్రయించడానికి తొలుత వేదాం త బోర్డు ఆమోదం తెలపగా, ఈ పరిమాణాన్ని 3.31 శాతానికి (14 కోట్ల షేర్లు) పెంచాలని వేదాంత డైరెక్టర్ల కమిటీ బుధవారం నిర్ణయించినట్టు కంపెనీ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. బీఎస్‌ఈలో హింద్ జింక్ షేరు ధర రూ.573 వద్ద ముగిసింది. ఈ ధరతో 14 కోట్ల షేర్లను విక్రయిస్తే వేదాంతకు రూ.8,021 కోట్లు సమకూరుతాయి. జూన్ త్రైమాసికం ముగిసేనాటికి హింద్ జింక్‌లో వేదాంతకు 64.92 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 29.54 శాతం చొప్పున వాటా ఉన్నది. జూన్ 30 నాటికి వేదాంతకు రూ. 61,324 కోట్ల నికర రుణం ఉన్నది.
ఆఫర్ ఫ్లోర్ ధర రూ. 486
వేదాంత జారీచేయనున్న ఆఫర్ ఫర్ సేల్‌కు రూ.486 ఫ్లోర్‌ధరగా నిర్ణయించినట్టు హిందుస్థాన్ జింక్ స్టాక్ ఎక్సేంజీ లకు తెలిపింది. ఆఫర్ ఆగస్టు 16న ప్రారంభమై 19న ముగుస్తుందని వెల్లడించింది.