28-08-2025 11:40:52 AM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలంనకు ఎగువన ఉన్న గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉపనదులు(Godavari tributaries) పొంగి ప్రవహించటం వల్ల గోదావరి నది నీటి మట్టం ఉధృతంగా పెరుగుతున్నది. గురువారం ఉదయం 10 గంటలకు 36.7 అడుగులకు చేరుకొని ఇంకా పెరుగుతూనే ఉన్నది. భద్రాచలం డివిజన్ చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు(Taliperu Project) కూడా పొంగి ప్రవహిస్తున్నది.
దీంతో ప్రాజెక్టుకు చెందిన 24 గేట్లు ఎత్తి 36వేల 579 క్యూసెక్కుల నీరు గోదావరి నదిలోకి వదులుతున్నారు. భద్రాచలం వద్ద గురువారం ఉదయం నుండి గోదావరి నది నీటిమట్టం పెరుగుతూ ఉన్నది. ఇదే విధంగా పెరుగుతూ గురువారం రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. 36 అడుగులకు చేరుకోగానే భద్రాచలం గోదావరి స్నాన ఘట్టాలు నీటిలో మునిగిపోయి యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు