18-10-2025 01:41:31 AM
-ఏడుపాయల వనదుర్గమ్మ దర్శనం పునరుద్ధరణ
-తగ్గిన మంజీరా ప్రవాహం
-62 రోజుల తర్వాత తనివితీరా అమ్మను దర్శించుకుంటున్న భక్తులు
పాపన్నపేట, అక్టోబర్ 17 : మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి జలదిగ్బంధం వీడింది. 62 రోజులుగా అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్న సంగతి విధితమే. భారీ వర్షాల నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలడంతో వనదుర్గామాత ఆలయం సమీపంలో ఉన్న 30 శతకోటి ఘనపుటడుగుల వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగిపొర్లింది. ప్రాజెక్టు పైనుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ ఉధృతంగా దిగువకు ప్రవహించిన సంగతి తెలిసిందే.
దీంతో వనదుర్గామాత ఆలయం ముందున్న ఏడు పాయల్లో ఒకటైన నదీపాయ ఉధృతంగా ప్రవహించడంతో అమ్మవారి ఆలయానికి భక్తుల రాకపోకలు స్తంభించాయి. దీంతో ఆగస్టు 14న అమ్మవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసిన విషయం విధితమే. వనదుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ప్రతిష్టించి భక్తులకు అమ్మ దర్శనం కల్పించారు.
62 రోజుల తర్వాత శుక్రవారం నీటి ప్రవాహం పూర్తిగా తగ్గడంతో ఆలయంలోని చెత్తా చెదారాన్ని శుభ్రం చేసి వేకువ జామునే అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి దర్శనాన్ని పునః ప్రారంభించారు. భక్తులు, సందర్శకులు నదీ పాయల్లో తనివితీరా పుణ్యస్నానాలు ఆచరించి వనదుర్గామాత దర్శనానికి బారులు తీరారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.