30-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి29: బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి, వెండి ధరలు గురువారం రికార్డు స్థాయికి చేరాయి. ఇరాన్‌పై సైనిక చర్యకు దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు భారీగా మొగ్గుచూపారు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం 10 గ్రాములకు రూ. 1.80లక్షలు దాటడం, వెండి కూడా మొదటిసారిగా రూ.4లక్షల స్థాయిని దాటింది.
దేశీయ మార్కెట్‌లో కూడా ఆ లోహాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. బంగారం రెండు లక్షల రూ పాయల వైపు పరుగులు పెడుతుండగా వెండి ధర ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఏకంగా రూ.4 లక్షలు దాటి రికార్డు స్థాయికి చేరుకుంది. హైదరబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల మేలిమి బం గారం 10 గ్రాముల ధర రూ.1,85,000 దాటింది. అటు వెండి రేటు కూడా రూ.4లక్షలు పలికింది.
బుధవారం రాత్రి హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగా రం రేటు రూ.1,73,300గా ఉంది. అయితే కొన్ని గంటల్లోనే బంగారం ధర రూ.12 వేలకు పెరగడం విశేషం. యూఎస్ డాలర్ బలహీనపడటం, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం కూడా ఈ ర్యాలీకి కారణమైంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.11,770 పెరిగి రూ.1,78, 850కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10, 800 ఎగబాకి రూ.1,63, 950 పలుకుతోంది. వెండి ఒక్కరోజే రూ.౨౫ వేలు పెరి గింది. కిలో రూ.4,25,000 వద్ద కొనసాగుతోంది.
ఇంత వేగంగా వెండి ధర పెరగడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. గతేడాది జనవరి 29న ఒక కిలో వెండి ధర 1.04 లక్షల రూపాయల వద్ద ఉంది. అక్కడ నుంచి ఏకంగా 280 శాతం పెరిగి ఏడాది సమయంలో 4 లక్షల రూపాయలకు చేరింది. బంగారం ధర కన్నా వెండి ధర మరింత భారీగా వేగంగా పెరిగింది అని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న డిమాండ్ వల్లనే వెండి ధర భారీగా పెరుగుతుంది.