calender_icon.png 30 January, 2026 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్.. తెలంగాణ ఆత్మగౌరం

30-01-2026 01:06:04 AM

  1. ఆయనను టచ్ చేయడం అంటే.. రాష్ట్రాన్ని టచ్ చేయడమే
  2. బొగ్గు కుంభకోణం మరకల దృష్టి మళ్లించేందుకే డ్రామా
  3. రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట
  4. రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదు
  5. కేసీఆర్‌కు సిట్ నోటీసులపై హరీశ్‌రావు  

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి) : మాజీ సీఎం కేసీఆర్.. తెలంగాణ ఆత్మగౌరవమని  మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఆయనను టచ్ చేయడం అంటే.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే రేవంత్‌రెడ్డి అని హెచ్చరించారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని, అలాంటి చరిత్రాత్మక నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమేనని తెలిపారు.

కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై గురువారం ట్విట్టర్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు. తెలంగాణ జాతి పిత, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు కేసీఆర్‌పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండించారు. పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు.

ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. చరిత్రను సృష్టించిన వాడు కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న హీనుడు రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదు.. అహంకారం అంతకంటే కాదని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే ఉందని స్పష్టం చేశారు. మీ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని హితవు పలికారు.