calender_icon.png 30 January, 2026 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్‌కు పిలుపు

30-01-2026 01:31:51 AM

  1. నందినగర్ నివాసంలో నోటీసులు అందజేసిన సిట్
  2. శుక్రవారం మధ్యాహ్నం ౩ గంటలకు విచారణ 
  3. హైదరాబాద్ పరిధిలో మీరు కోరుకున్న చోటుకు మేమే వస్తాం
  4. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎంకు నోటీసులు జారీ
  5.   160 సీఆర్పీసీ కింద విచారణకు హాజరుకావాలని ఆదేశం 

హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 29 (విజయ క్రాంతి): తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావుకు దర్యాప్తు సంస్థ సిట్ గురు వారం నోటీసులు జారీ చేసింది. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ , ప్రభుత్వ డేటా ధ్వంసం కేసులో విచారణకు హాజరుకావాలని (సిట్‌లో భాగమైన) జూబ్లీ హిల్స్ డివిజన్ ఏసీపీ పి.వెంకటగిరి బంజారాహిల్స్‌లోని కేసీఆర్ కుటుంబ సభ్యులకు నోటీసు అందేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని కోరారు.

అయితే, కేసీఆర్ వయస్సు 65 ఏళ్లు దాటినందున, సీఆర్పీసీ సెక్షన్ 160 నిబంధనల ప్రకారం ఆయన నేరుగా పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని నోటీసులో స్పష్టం చేశారు. కేసీఆర్ కోరుకుంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రావచ్చు లేదా హైదరాబాద్ నగరంలో ఆయనకు అనువైన ఏదైనా ప్రదేశాన్ని నందినగర్ నివాసం వంటివి సూచిస్తే, దర్యాప్తు బృందమే అక్కడికి వచ్చి విచారిస్తుందని పేర్కొన్నారు.

ముందస్తు సమాచారం ఇవ్వండి

విచారణ ఏ ప్రదేశంలో జరగాలనేది కేసీఆర్ ముందే తెలియజేయాలని సిట్ కోరింది.  కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని ఆయన నివాసం వద్ద పోలీసులు సందడి పెరిగిం ది. గురువారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులు కేసీఆర్ ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం సిట్ అధికారులు కేసీఆర్‌ను విచారించేందుకు వచ్చే అవకాశం ఉన్నందున, ఆ సమయంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉండాలి, ట్రాఫిక్ మళ్లింపు ఎక్కడ చేపట్టాలి అనే అంశాలపై పోలీసులు ఆరా తీశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెక్ పోస్టుల ఏర్పాటు, పోలీసు బందోబస్తుపై ఉన్నతా ధికారులు పర్యవేక్షించారు.   

నోటీసులు ఎందుకంటే..

పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగా కేసీఆర్‌ను విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, కీలకమైన ఇంటెలి జెన్స్ డేటాను ధ్వంసం చేశారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

ఇందులో ఐపీసీ సెక్షన్లు 166 ప్రభుత్వ ఉద్యోగి చట్టాన్ని ధిక్కరించడం, 409 నేరపూరిత విశ్వాసఘాతుకం, 427, 201 సాక్ష్యాధారాల ధ్వంసం, 120 బి, కుట్రతో పాటు ఐటీ యాక్ట్, ప్రభుత్వ ఆస్తుల నష్టం నివారణ చట్టం కింద కేసులు నమోద య్యాయి. ఈ కేసులో కేసీఆర్‌కు వాస్తవాలు తెలిసి ఉండే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థ భావిస్తోంది.