30-01-2026 01:13:05 AM
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి) : తమ వైఫల్యాలను కప్పిపుచ్చు కునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు.. ఇప్పుడు విచారణల పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన, కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులివ్వడంపై గురువారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు.
చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. సాధించిన తెలంగాణను పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటిచెప్పిన నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని, రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్ల వం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథం లో నడిపిన గొప్ప విజనరీ కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు.
అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇది విచారణ కాదు.. ఇది ప్రతీకారమని, ఇది న్యాయం కాదు.. ఇది రాజకీయ దురుద్దేశమని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడని, నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని హితవు పలికారు.
తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని, బీఆర్‌ఎస్ పార్టీ ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామని, తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు, ప్రజల తీర్పు తోనే రాస్తారని హెచ్చరించారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కక్ష సాధింపు చర్యలు దుర్మార్గం
దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజాసమస్యలపై దృష్టి పెట్టకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం. ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చినందుకు నోటీసు ఇచ్చారా?. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హామీలను అమలు చేయడం మరిచి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నది.
ప్రజల కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి ఉద్యమం చేసిన నాయకుడిపై ప్రతీకార రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ. పదేళ్లలో అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి అన్నివర్గాల ప్రజల అభిమానం పొందిన, గొప్ప పాలనా దక్షుడు కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ రాజకీయ కక్షే. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
మాజీమంత్రి తలసాని శ్రీనివాస్
యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లు
తెలంగాణ ఉద్యమ శిఖరం, రాష్ట్ర స్వాప్నికుడు, సాధకుడు కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గం. కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం. తెలంగాణకు ప్రతిరూపం కేసీఆర్. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణ సమాజానికే నోటీసులు ఇచ్చినట్టే. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమే. సీఎం రేవంత్‌రెడ్డిలో తీవ్ర అభద్రతా భావం పెరిగిపోయింది.
తన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో కప్పిపుచ్చుకునేందు సిట్లు, కమిషన్ల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్న దురుద్దేశంతోనే ఈ నోటీసుల డ్రామా. ప్రభుత్వ సంస్థలు స్వతంత్రత కోల్పోయి కేవలం కీలుబొమ్మలుగా మారాయి. రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ వ్యక్తిత్వానికి, ప్రతిష్టకు రేవంత్‌రెడ్డి పిల్లచేష్టలతో మలినం అంటించడం సాధ్యం కాదు. ఇలాంటి కక్షసాధింపు చర్యలతో చివరికి రేవంతే నవ్వులపాలవుతారు.
మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
కాంగ్రెస్ సిగ్గుతో తలదించుకోవాలి
సిట్ ఎప్పుడు ఏర్పాటైంది. కేసీఆర్‌కు నోటీసులు ఎందుకు ఇచ్చారు. రెండేళ్లుగా ఏం ప్రశ్నలు అడగాలో సిట్‌కు తెలియలేదా. కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తలదించుకోవాలి. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలి. రాజకీయ నాయకులు ఎవరినైనా చంపమంటే పోలీసులు చంపుతారా..? కాంగ్రెస్ ప్రభుత్వ చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. పోలీసు నిఘావర్గాలు చేసే దానికి రాజకీయ నాయకులకు ఏం సంబంధం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే స్కాంలు రోజుకొకటి బయటకి వస్తున్నాయి. కేసీఆర్‌కు నోటీసులపై కాంగ్రెస్ పార్టీకి ప్రాయచిత్తం తప్పదు. ఈ ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నా చేసేది చిల్లర రాజకీయాలే.
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
హామీలు అమలు చేయలేకనే బెదిరింపులు
సాధ్యం కాని హామీలు ఇచ్చి ఆచరణలో అమలు చేయలేక పోలీస్‌లను అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్ నాయకులను నోటీసుల పేరిట బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్‌కు సిట్ నోటీస్ ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపు చర్య. స్వరాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలను ఏకం చేసి, శాంతియుత ప్రజాఉద్యమల ద్వారా కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌కు పోలీస్ నోటీస్ ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా..?
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్
రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు రావలసిందిగా కేసీఆర్‌ను పిలవడం తీవ్ర శోచనీయం. ఇది రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట. సిట్ విచారణ టీవీ సీరియళ్లను తలపిస్తున్నది. ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల పరిష్కారంలో పాలకులు ఘోరంగా విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అవినీతిలో కూరుకుపోయి, కుంభకోణాలమయం అయిన రేవంత్ సర్కార్ దిక్కుతోచని స్థితిలో ఉంది. రాష్ట్రాన్ని సాధించడమే కాక పదేళ్ల తన సుపరిపాలనలో గొప్పగా అభివృద్ధి చేసిన కేసీఆర్‌పై చేస్తున్న దుర్మార్గ ప్రచారంలో భాగమే ఈ నోటీసులు. తెలంగాణ యావత్ ప్రజల గుండె చప్పుడు కేసీఆర్‌ను టార్గెట్ చేసి ఎలాంటి సంబంధమూ లేని కేసులో విచారించాలనే కుట్ర దుర్మార్గం. ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసి తమ పార్టీ నాయకులపై విచారణల పేరిట దాడులకు దిగడం తీవ్ర ఆక్షేపణీయం.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
రాష్ట్ర ఆత్మ గౌరవానికి నోటీసు ఇచ్చినట్టే
తన ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి నోటీసులు ఇచ్చినట్టే. రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు చిక్కి జైలుకు పోయానని వ్యక్తిగత కక్షతో కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై ఏదో ఒక కేసును మోపుతున్నారు. వారిని కూడా ఏదో రకంగా జైలుకు పంపాలని కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతుంటే దానిని డైవర్షన్ చేయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును ముందుకు తీసుకొస్తున్నారు. రానున్న రోజుల్లో తప్పకుండా రేవంత్‌రెడ్డికి గుణపాఠం చెబుతారు.
బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్
కేసీఆర్‌కు మరక అంటించేందుకే సిట్‌నోటీసులు
ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కేసీఆర్ సాధించిన అభివృద్ధిని ప్రజలు మరచిపోవడానికి ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్‌రెడ్డి తెరపైకి తెచ్చారు. కేసీఆర్‌కు మరక అంటించేందుకే సిట్ నోటీసులు ఇచ్చింది. రేవంత్‌రెడ్డి పాలనలో కేసులు, నోటీసులు తప్ప ఎలాంటి ప్రగతీ కనిపించడం లేదు. మంత్రిగా కూడా పని చేసిన అనుభవం రేవంత్‌రెడ్డికి లేకపోవడమే అసలు సమస్య.
ఎలాంటి పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తారో తెలియని అజ్ఞాని, మూర్ఖుడు రేవంత్‌రెడ్డి. ఆధారాలుంటే రెండేళ్లు సిట్ విచారణ జరుగుతుందా? సీఎం బావమరిది సృజన్‌రెడ్డి బొగ్గు కుంభకోణంలో దొరికి పోయారు కనుకే సిట్ నోటీసులతో వేధిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో రాజకీయ జోక్యం ఉండదని తెలిసి కూడా రేవంత్ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. సజ్జనార్ అత్యుత్సాహం ఎక్కువైంది.
మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
పారదర్శకంగా సిట్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ పారదర్శకంగా సాగుతోంది. ఉద్యమ నాయకుడిగా మాజీ సీఎం కేసీఆర్ అంటే తమకు గౌరవం ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ట్యాపింగ్ ఉదంతంలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందనేది నిగ్గు తేలాల్సి ఉంది. అధికారుల ప్రమేయం మాత్రమే కాకుండా, అప్పటి ముఖ్యమంత్రి, మంత్రుల ఆదేశాలు లేకుండా ఇంతటి భారీ స్థాయి ఉల్లంఘనలు జరగవు. సిట్ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా అవసరమైతే ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం సిట్‌కు ఉంది. కేసీఆర్‌కు నోటీసుల విషయంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు. ఇది కేవలం చట్టపరమైన ప్రక్రియ అని, బాధ్యులెవరైనా శిక్ష అనుభవించాల్సిందే.
అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్
టీవీ సీరియల్‌గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
రాష్ర్టంలో స్కామ్‌లు వేగంగా పరిగెడుతున్నాయి. తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందనే భయంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి గేమ్ ఆడుతున్నాయి. తెలంగాణలో కుంభకోణాలు, అవినీతి, మంత్రుల మధ్య గొడవలు రోజువారీ వార్తలుగా మారాయి. రాష్ర్టం స్కామ్‌లకు పరిశోధన కేంద్రంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రోజువారీ టీవీ సీరియల్‌గా మార్చారు. రోజుకో పేరును ప్రస్తావిస్తూ(కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై) సిట్ పేరిట కాలయాపన చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ సాధించలేదు. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులను శిక్షించిన పాపాన పోలేదు.
బీజేపీ ఎంపీ లక్ష్మణ్
ఆత్మగౌరవం అమరవీరుల త్యాగాల్లో..
కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చే అధికారం సిట్‌కు ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వచ్చిన విషయాల ఆధారంగా కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారని మేం భావిస్తున్నాం. అధికారంలో ఉండి రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారులు, సినిమా వాళ్లు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేశారని అభియోగాలున్నాయి. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ నాయకులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు దెబ్బతింటుందో హరీశ్‌రావు చెప్పాలి. తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ అమరవీరుల త్యాగాల్లో ఉంటుంది.
గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వగానే ఏదో జరిగిపోతుందని హడావిడి చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టారు. కేసీఆర్ వయసు ఆధారంగా ఆయనకు సిట్ అధికారులు గౌరవం ఇస్తారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేసీఆర్ కూతురు కవిత కూడా స్వయంగా చెపుతోంది. కేసీఆర్ చట్టానికి సహకరించాల్సిందే.
ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్