21-06-2024 12:05:00 AM
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్‌తో దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమా గురువారం ప్రధాన బృందంతోపాటు కొద్ది మంది అతిథుల నడుమ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్, నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు క్లాప్‌నిచ్చారు. ‘క్రాక్’, ‘వీర సింహారెడ్డి’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న గోపీచంద్ మలినేని తనదైన మాస్ యాక్షన్ అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 22 నుంచి మొదలవనుంది. తొలి సినిమా మినహా దర్శకుడు గోపీచంద్ అన్ని సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన తమన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: రిషి పంజాబీ, కళా దర్శకత్వం: అవినాష్ కొల్లా, పోరాటాలు: అనల్ అరసు, రామ్ లక్ష్మణ్, వెంకట్, మాటలు: సౌరభ్ గుప్తా.