17-11-2025 10:09:26 PM
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్..
మునిపల్లి: సీసీఐలో పత్తి కొనుగోళ్లు చేసేందుకు కొత్తగా తీసుకవచ్చిన కపాస్ యాప్ తో రైతులకు ఇబ్బందులు పడుతుంటే తాము రైతుల పక్షాన ఎల్లప్పుడు ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం మండల కేంద్రమైన పరిధిలోని పోల్కంపల్లి, ఖమ్మంపల్లి గ్రామాల శివారులోని పీఎస్ఆర్ గార్డెన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత ఎన్నడులేని విధంగా ఈసారి కొత్తగా సీసీఐ తీసుకవచ్చిన కపాస్ యాప్ తో రైతులు పడరాని పాట్లు పడుతున్నారన్నారు. అలాగే ఎల్ 1, ఎల్2, ఎల్ 3 అంటూ కొత్త నిబంధనలు పెట్టి రైతులకు ఇబ్బందులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో సీసీఐ కొనుగోళ్లలలో ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున కొనుగోళ్లు చేస్తే.. కొత్తగా తీసుకవచ్చిన కపాస్ యాప్ తో ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కపాస్ యాప్ ను తొలగించి పాత పద్దతి ద్వారా పత్తి కొనుగోళ్లను చేపట్టి రైతులకు ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో రైతు బంధు మండల అధ్యక్షుడు పరుశరాం గౌడ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు గడ్డం భాస్కర్, నాయకులు రామక్రిష్ణ, బక్కన్న, బాగయ్య, జంషీద్, నవీన్, అప్సర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.