21-06-2024 12:05:00 AM
‘మగధీర’ సినిమాతో ప్రతినాయకుడిగా తెలుగు వారికి చేరువైన దేవ్ గిల్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అహో విక్రమార్క’. దేవ్ గిల్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన భార్య, ఆర్తి ఈ సినిమాని నిర్మించారు. పేట త్రికోటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిత్ర శుక్ల కథానాయిక. ప్రభాకర్, పోసాని కృష్ణ మురళి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో మరాఠీ థియేటర్ ఆర్టిస్ట్, సినీదర్శకుడు, నటుడు అయిన ప్రవీణ్ టర్డే ప్రతినాయకుడిగా కనపడనున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు రాజమౌళి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవ్ గిల్ మాట్లాడుతూ “వ్యక్తిగా నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు. నటుడిగా గుర్తింపునిచ్చింది మాత్రం రాజమౌళి. ఈ సినిమాలో నేను కొత్తగా కనపడతాను. ప్రేక్షకులు హీరోగానూ నన్ను ఆదరిస్తారని నమ్ముతున్నా” అని అన్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.