calender_icon.png 24 October, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోగస్ ఉద్యోగులపై సర్కారు కొరడా!

24-10-2025 01:16:57 AM

-ఇప్పటికే 15 వేల మంది గుర్తింపు

-మొత్తంగా 25 వేల మంది వరకు బోగస్ ఉద్యోగులు!

-కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో మోసాలను గుర్తించిన త్రిసభ్య కమిటీ

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో జరిగిన మోసాలను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బోగస్ ఉద్యోగులుగా తేలినవారిపై, వారికి సహకరించిన ఏజన్సీలపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమయ్యింది. 

త్రిసభ్య కమిటీ గుర్తించిన మోసం

కొద్ది కాలం క్రితం మాజీ సీఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్యపై విచారణ చేసింది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా బోగస్ ఉద్యోగులు ఉన్నట్టుగా త్రిసభ్య కమిటీ గుర్తించింది. వాస్తవంగా పనిచేస్తున్నవారి సంఖ్యకు, మొత్తం చూపుతున్న సంఖ్యకు పొంతన లేదని, ఈ తతంగంలో కొందరు పలుకుబడి ఉన్న నాయకులు, కాంట్రాక్టు సంస్థలు, మ్యాన్‌పవర్ సంస్థలు భారీగా ప్రభుత్వ ఖజానాకు భారీగా బుంగ పెట్టినట్టుగా గుర్తించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ నివేదించింది.

ఈ నివేదికలో పొందుపర్చిన సమాచారంతో ప్రభుత్వ పెద్దలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ మోసానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా బోగస్ ఉద్యోగులపై కొరడా ఝులిపించాలని, కాంట్రాక్టు సంస్థలు, నాయకులు, ఔట్ సోర్సింగ్ ఏజన్సీలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు పలు శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సెక్రెటరీలు సమీక్షలు జరిపారు. ఇప్పటి వరకు జరిపిన ఆయా శాఖల సమీక్షల్లో సుమారు 15వలే మంది బోగస్ ఉద్యోగులను గుర్తించినట్టుగా తెలుస్తున్నది. మిగిలిన శాఖల సమీక్షలను పూర్తయితే.. ఈ బోగస్ ఉద్యోగుల సంఖ్య సుమారు 25వేల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అసలు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాల గురించి నోరు మెదపని కొన్ని శాఖలున్నాయని.. అక్కడి నుంచి కూడా సమాచారం అందితే ఈ లెక్కలు పక్కాగా చెప్పవచ్చని ఒక ఉన్నతాధికారి చెప్పడం గమనార్హం. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను ఎక్కువగా నియమించుకున్న శాఖల్లో విద్య, వైద్యం, మున్సిపాలిటీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు, వ్యవసాయం దాని అనుబంధ విభాగాలు, పలు కార్పొరేషన్లు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇందులో కొన్ని శాఖలపై సమీక్ష జరగ్గా.. మరికొన్ని శాఖలపై సమీక్ష జరగాల్సి ఉంది. త్వరలోనే మూణ్నాలుగు సమావేశాలను నిర్వహించి మొత్తం బోగస్ ఉద్యోగులను గుర్తించాలనే పట్టుదలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

పదేండ్లుగా ప్రభుత్వ సొమ్ము స్వాహా

గత ప్రభుత్వ హయాంలో గడిచిన పదేండ్లుగా ఈ బోగస్ ఉద్యోగుల పేర్లను జాబితాలో చేర్చి ప్రతి నెలా సుమారు రూ.60 నుంచి రూ.75 కోట్ల వరకు కొల్లగొడుతున్నట్టుగా అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఈ లెక్కన ఏటా సుమారు రూ.750 కోట్లు.. గడిచిన పదేండ్లలో సుమారు రూ.7500 కోట్ల వరకు బోగస్ ఉద్యోగుల పేరిట నాయకులు, కాంట్రాక్టు సంస్థలు, ఔట్‌సోర్సింగ్ ఏజన్సీలు మెక్కినట్టుగా లెక్కిస్తున్నారు. అన్ని శాఖల నుంచి సమాచారం పూర్తిగా వచ్చి, ఒక్కో ఉద్యోగికి సంబంధించిన సమాచారాన్ని వెబ్‌సైట్లో నమోదుచేస్తేగానీ ఈ ఉద్యోగుల సంఖ్య, ఖజానాకు పడ్డ చిల్లుపై ఒక స్పష్టత రాదు. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

పట్టణ సంస్థల్లోనే ఎక్కువ!

హైదరాబాద్ మహా నగరంతోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాలు, అలాగే ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, సంగారెడ్డి, సిద్దిపేటలాంటి పట్టణ ప్రాంతాల్లోనే ఈ ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటూ వస్తోంది. అధికారుల సమీక్షలోనూ పట్టణ ప్రాంతాల్లోని సంస్థల్లోనే దాదాపు 95 శాతానికిపైగా బోగస్ ఉద్యోగులను గుర్తించినట్టుగా సమాచారం. అందుకే పట్టణ సంస్థలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన అధికారులు ఆ దిశగానే సమాచార సేకరణలో నిమగ్నమైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పనిచేస్తున్నవారు ఎవరు, బోగస్ ఉద్యోగులు ఎందరు అనేది గుర్తించేందుకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ ఈ నెల 25 వరకు తమ ఆధార్, బ్యాంకు అకౌంట్ సమాచారాన్ని అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ వివరాలను ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని సర్కారు ఆదేశించింది. సమాచారం అందించకపోతే జీతాలు ఇవ్వబోమని తేల్చి చెప్పడంతో బోగస్ ఉద్యోగుల అంశం మరోసారి చర్చకు వచ్చింది.

ఔట్ సోర్సింగ్ జేఏసీ పిలుపు

ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తమ శాఖాధిపతుల సూచనలతో ఆక్టోబర్ 25 లోగా తమ ఆధార్, బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని ఐఎఫ్‌ఎంఐఎస్ వెబ్‌సైట్‌లో తప్పని సరిగా నమోదు చేసుకోవాలని తెలంగాణ స్టేట్ ఔట్‌సోర్సింగ్ జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య పేర్కొన్నారు. ఇలా అడిగిన సమాచారాన్ని అందించినవారికే ఈ నెల జీతం వస్తుందని, వారికి ప్రత్యేకంగా ఒక ఐడీని కూడా ఇస్తారని ఆయన తెలిపారు. అలాగే ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ఈపీఎఫ్, ఈఎస్‌ఐ తప్పనిసరిగా ఉండాలని, లేనివారు వెంటనే తమ జేఏసీని సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.