16-08-2025 12:00:00 AM
-ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
-ఉత్సాహభరితంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు
-త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి ధనసరి అనసూయ సీతక్క
ములుగు, ఆగస్టు 15 (విజయక్రాంతి):ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా పండుగ వాతావరణంలో పంద్రాగస్టు కార్యక్రమాలు కొనసాగాయి.ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వేడుకలకు విచ్చేసిన చిందం రాజా మల్లు స్వాతంత్ర సమరయోధునికి మంత్రి సన్మానించారు.ముఖ్య అతిథి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు డిఆర్డిఏ ద్వారా మహిళ సంఘాలకు బ్యాంకు లింకేజి రుణాలు 492 సంఘాలకు, 31 కోట్ల 50 లక్షల చెక్కును జిల్లా సమాఖ్య సభ్యులకు మంత్రి అందచేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ఇద్దరు లబ్ధిదారులకు కుట్టు మిషన్ లను పంపిణీ చేశారు. 10వ తరగతి, ఇంటర్ లో టాపర్లుగా నిలిచిన 4విద్యార్థులకు 10వేల చోప్పున బహుమానం అందించారు. మెప్మా క్రింద 148స్వయం సహాయక మహిళా సంఘాలకు 17 కోట్ల 36లక్షల 98వేల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేశారు.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంద్రాగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వ్యవసాయ, ఉద్యానవ పట్టు పరిశ్రమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్యశాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, గృహ నిర్మాణ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శించారు.
మాజీ ప్రధాని స్వగ్రామంలో 79 ఫీట్ల జాతీయ జెండా ఎగురవేత వంగరం నుంచి ఫిట్ ఇండియా ఉద్యమం..
భీమదేవరపల్లి ,ఆగస్టు 15 (విజయ క్రాంతి) మాజీ ప్రధాని పివి నరసింహారావు స్వగ్రామం వంగర బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో 79 ఫీట్ల స్తంభం పై ఏర్పాటు చేసిన జాతీయ జెండాను బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఆఫ్రిన్ సుల్తానా ఎగరవేశారు. 79 ఫీట్ల జాతీయ జెండాను ఏర్పాటు చేసిన కాజీపేట ఏసిపి ముఖ్యఅతిథిగా హాజరై మీడియాతో మాట్లాడుతూ భారత వనికి స్వాతంత్రం సిద్ధించి 79 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 79 అడుగుల పొడవు గల స్థంభంపై 108 చదరపు గజాల జాతీయ జెండాను తయారుచేసి ఎగురవేయడం జరిగిందన్నారు
బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు నేటి నుండి ఆనాడు క్విట్ ఇండియా ఉద్యమం ఎలా సాగిందో నేడు విద్యార్థులు ఫిట్ ఇండియా ఉద్యమం కొనసాగించాలన్నారు క్విట్ ఇండియా ఉద్యమం అంటే బాలికలు ఉత్తమ మార్కులు సాధించడమే కాకుండా శాస్త్రవేత్తలుగా డాక్టర్లుగా అనేక రంగాలుగా ఎదిగేందుకు ఈ ఉద్యమం స్వీకరించాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు వంగర ముద్దుబిడ్డ పీవీని ఆదర్శంగా తీసుకొని ఈ గడ్డ మీద చదువుకున్న బాలికలు పీవీ వలె ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభిలాషించారు నేడు పివి వల్లనే ప్రపంచంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ మూడవ స్థానానికి చేరుకుందని కొనియాడారు అనంతరం పాఠశాలలో ఉత్తమ విద్యార్థులు సాధించిన బాలికలకు ఏసిపి ప్రశాంత్ రెడ్డి జ్ఞాపకలతో పాటు నగదును అందజేశారు
ప్రజా పాలనలో మానుకోట జిల్లా సమగ్రాభివృద్ధి : ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
మహబూబాబాద్, ఆగస్టు 15 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో మహబూబాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో గణనీయమైన ప్రగతి సాధిస్తుందని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గణాంకాల వారీగా వివరించారు.
నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గంగారం మండలం ఐదు అంశాల్లో ఆశించిన ప్రగతి సాధించి సిల్వర్ మోడల్ సాధించిందని పేర్కొన్నారు. అలాగే పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలతో రాష్ట్రంలో ప్రథమ స్థానం సంపాదించిందన్నారు. ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, రైతు బీమా, సన్న బియ్యం, అమ్మ ఆదర్శ పాఠశాలలు, వాణిజ్య పంటల సాగు, స్వయం ఉపాధి పథకాలు, మాతా శిశు సంక్షేమం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, వృత్తి ఆధారిత అభివృద్ధి, మహిళా శక్తి, కొత్త రేషన్ కార్డులు మంజూరు, కొత్తగా నమోదు, ధాన్యానికి 500 రూపాయల బోనస్, కొత్తగా పింఛన్లు మంజూరు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మాతా శిశు సంక్షేమం కోసం ఆరోగ్యలక్ష్మి పథకం అమలు, విద్య అభివృద్ధికి ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఏర్పాటు తదితర అంశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులకు విశిష్ట సేవలకు గాను ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందరావు, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వాతంత్ర సమరయోధులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలు..
మహబూబాబాద్, ఆగస్టు 15 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడ వాడల మువ్వన్నెల జెండాను ఎగరవేసి జండా వందనం సమర్పించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యఅతిథి ప్రభుత్వ విప్ , డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నా థ్, కాంగ్రెస్ కార్యాలయంలో డిసిసి అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, బీఆర్ ఎస్ కార్యాలయంలో అధ్యక్షురాలు మాలోత్ కవిత, వ్యవసాయ మార్కెట్‌లో చైర్మన్ సుధాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
కేసముద్రంలో..
కేసముద్రం పట్టణంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ గంటా సంజీవరెడ్డి, మున్సిపాలిటీ లో కమిషనర్ ప్రసన్న రాణి, తహసిల్ ఆఫీసులో తహసిల్దార్ వివేక్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో క్రాంతి, వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏవో వెంకన్న, మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ యాదగిరి, పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐ మురళీధర్ రాజ్ జాతీయ పతాకాలను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అలాగే అంబేద్కర్ సెంటర్, జ్యోతిబాపూలే సెంటర్, పొట్టి శ్రీరాములు సర్కిల్, గాంధీ సెంటర్, రైల్వే స్టేషన్, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సంక్షోభం నుంచి సంక్షేమం వైపు పయనిస్తున్న రాష్ట్రం :రాష్ట్ర ట్రైకార్ ఛైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఆగస్టు 15 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రజా పాలనలో రాష్ట్రం సంక్షోభం నుండి సంక్షేమం వైపు పయనిస్తోందని రాష్ట్ర ట్రై కార్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ క్రీడా మైదానంలో జరిగిన 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి గా విచ్చేసిన ఆయన పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బ్రిటీష్ బానిస సంకెళ్లు తెంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పండుగ రోజని, మన దేశ అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి సగర్వంగా మువ్వన్నెల జెండా ఎగరేసిన ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజన్నారు.
ఈ రోజు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలమని, సుధీర్ఘ పోరాటాల ఫలితం ఈ స్వాతంత్య్రం అన్నారు. మహనీయుల స్పూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచస్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్-2047 విజన్ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు నీతి అయోగ్ సమావేశంలో సీఎం వెల్లడించారన్నారు. ప్రజాపాలనలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అటవీ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీవో రవి, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ప్రజలు, విద్యార్ధిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విశిష్ట సేవలు అందించిన వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు.
కన్నాయిగూడెంలో..
కన్నాయిగూడెం, ఆగస్టు15(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కన్నాయిగూడెం మండల ఇంఛార్జి జాడి రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ ఆఫ్సర్ పాషా జాతీయ జండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, ఇందిరాగాంధీ హయాంలో జరిగిన అభివృద్ధి ఈ రోజు దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపింద న్నారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానిగా అవుతారు ఇండియా ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహదేవపూర్, (భూపాలపల్లి)లో..
మహదేవపూర్, (భూపాలపల్లి) జులై 15 (విజయ క్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల వ్యాప్తంగా మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రామారావు, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి రవీంద్రనాథ్, అటవిశాఖ కార్యాలయంలో అటవీ డివిజనల్ అధికారి సందీప్ రెడ్డి, పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకటేశ్వర్లు, శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం లో ఈవో మహేష్, వివిధ ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జెండాలు ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు అక్బర్ ఖాన్, టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, బిజెపి పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి మాజీ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్ రెడ్డి తదితరులు తమ జెండాలను ఆవిష్కరించి ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.
కేయూలో..
హనంకొండ/కె యు క్యాంపస్ ఆగస్టు 15 (విజయ క్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉపకులపతి కే ప్రతాపరెడ్డి జాతీయజెండా ఎగరేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం వి సి మాట్లాడుతూ అన్ని రంగాలతో పాటు అకాడమిక్ పరంగా కాకతీయ విశ్వవిద్యాలయం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. పరిపాలన భవనం ప్రాంగణంలో రిజిస్టర్ ఆచార్య వి.రామచంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్సిసి క్యాడేట్ల గౌరవ వందనం స్వీకరించి ఆయన జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.
ఈ వేడుకల్లో పాలకమండలి సభ్యులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, బోధన, బోధ నేతర సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. వైస్ ఛాన్సర్ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న మానవ ఆర్థిక, భౌతిక వనరులను సమర్థవంతంగా వినియోగించి కాకతీయ విశ్వవిద్యా లయం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లే విధంగా కృషి చేయాలి అన్నారు. ఇది ఎంతోమంది ఆశయ సాధన కేంద్రమైందని, తెలంగాణ ఉద్యమంలో విశ్వవిద్యాలయం పాత్ర మరువలేనిది అన్నారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన టి జి ఎడ్సెట్ 2025 మరియు 23వ స్నాతకోత్సవ విశ్వవిద్యాలయ నిర్వహణ సామర్థ్యానికి నిదర్శనం అన్నారు.
రూసా నిధులతో జాతీయస్థాయి పరిశోధనలకు వసతులు ఏర్పడుతున్నాయని అన్నారు. ఆచార్య ఎన్ ప్రసాద్, ఆచార్య ఇస్తారి నేతృత్వంలో పరిశోధనల ద్వారా పేటెంట్లు నమోదయినట్లు తెలిపారు. ఫార్మసీ కళాశాలకు హెచ్‌ఎంటీవీ అవార్డు లభించిందని, ఒప్పంద అధ్యాపకులు డాక్టర్ టి.రాధిక, ఆచార్య పీ.మల్లారెడ్డి, ఆచార్య పి. శ్రీనివాసరావు, ఆచార్య సి. జి. శ్రీలత, రిజిస్టర్ ఆచార్య వి. రామచంద్రం లాంటి అధ్యాపకులు ప్రతిష్టాత్మక అవార్డులు పొందారని గుర్తు చేశారు.కామర్స్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థిని మాచర్ల కృష్ణవేణి పదవ హాస్య టైక్వాండో ఛాంపియన్షిప్ లో కాంస్య పతాకం సాధించిందని, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ కృతిక ఉత్తమ వాలంటీర్ గా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గుర్తింపు పొందడం గర్వకారణం అన్నారు.
అలాగే విశ్వవిద్యాలయం ఎన్సిసి క్యాండెట్ డి.ప్రశాంత్ రిపబ్లిక్ డే పెరేడ్ ఎంపిక కావడం విశేషం అని అన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో, ఇతర విభాగాల్లో ప్రాంగణ నియమ కాలు విజయవంతంగా పూర్తయ్యా యని తెలిపారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయం గోల్డెన్ జూబ్లీ అడుగుపెడుతుండగా త్వరలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఆచార్య బి.సురేష్ లాల్, డాక్టర్ బి.రమ, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ చిర్ర రాజు, డాక్టర్ సుకుమారి, డీన్లు, ప్రిన్సిపల్, విభాగాధిపతులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, బోధనేతర ఉద్యోగులు, విశ్రాంత అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా బోధన, బోధ నేతర ,విశ్రాంత ఉద్యోగుల మధ్య నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా ఆగస్టు,సెప్టెంబర్ నుండి విద్యార్థులకు మరియు ఉద్యోగుల కోసం ఫేస్ రికగ్నిషన్ హాజరు వ్యవస్థ అమలు చేస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ అన్నారు.
పంద్రాగస్టు వేడుకల్లో అపశృతి..
చిట్యాల, ఆగస్టు 15 (విజయ క్రాంతి): పంద్రాగస్టు వేడుకల్లో అపశృతి దొరిల్లింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినికి జెండా కర్రకు రంగు కాగితాలు అతికిస్తుండగా 9వ తరగతి విద్యార్థిని దైన పల్లి సిరి విద్యుదాఘాతానికి గురై గాయ పడింది. ఈ విషయాన్ని గమనించిన ఉపా ధ్యాయులు వెంటనే ఆమెను చిట్యాల ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిం చిన వైద్యులు చేతులకు స్వల్ప గాయాలు అయ్యాయని, ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ ఘాతంతో గాయపడ్డ విద్యార్థిని సిరిని చిట్యాల తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్ పరామర్శించి విద్యుత్ షాక్ కు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.