23-10-2025 05:56:35 PM
దళారుల జేబుల్లో నిరుపేదల ఆకలి..
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన ప్రభుత్వ సన్నబియ్యం పక్కదారి పడుతున్నట్టు సమాచారం అందుతోంది. నిత్యం నిరుపేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని దళారులు వెంకటియ తండా, గిరిపురం, చిల్లంచర్ల, గ్రామాల నుంచి అత్యధికంగా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తున్నా, సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అన్నపూర్ణగా విరాజిల్లుతున్నా, ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఈ బియ్యం కొందరి కక్కుర్తి కారణంగా లాభార్జనకు సాధనంగా మారుతోంది. మరిపెడ మండలం నుండి సూర్యాపేట జిల్లా వంటి సరిహద్దు ప్రాంతాలకు ఈ బియ్యాన్ని రహస్యంగా తరలిస్తున్నట్లు సమాచారం.
నల్లబజారులో సాగుతున్న ఈ వ్యాపారంలో, మార్కెట్లో కిలో రూ.50 నుంచి రూ.90 వరకు పలుకుతున్న సన్నబియ్యాన్ని దళారులు రేషన్ కార్డు లబ్ధిదారుల నుండి కేవలం రూ.10 నుండి రూ.15 ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. పేదల ఆకలిని పెట్టుబడిగా మార్చుకొని ఈ దందా గిరిపురం, అనేపురం, చిల్లంచర్ల కేంద్రంగా సాగుతోంది. సేకరించిన ఈ బియ్యాన్ని కాకరావయి ప్రాంతానికి భారీఎత్తున చేరవేసి, అధిక ధరలకు అమ్ముకుంటూ లాభాలను ఆర్జిస్తున్నారు. దళారుల ముఠా చాకచక్యంగా ఈ అక్రమ రవాణాను నడుపుతున్నా, అధికారులు కేవలం నామమాత్రపు చర్యలు తీసుకుని, చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ, పేదల సరుకును దోచుకుంటున్న ఈ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే మేల్కొని ఈ సన్నబియ్యం దారి మళ్లింపును పూర్తిస్థాయిలో అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మరిపెడ ఎమ్మార్వో కృష్ణవేణి..
ఎంక్వైరీ చేసి పక్కదారి పట్టిస్తున్న రేషన్ బియ్యం దళారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం
పులిపాలుపుల రవీందర్
ఆర్ఎంపి ఎలమంచిలి తండ గ్రామపంచాయతీ
సన్నబియాన్ని ప్రతి ఒక్కరు అమ్ముకుంటున్నారు.అలా అమ్ముకోకుండా తినటం వల్ల లబ్ధిదారులకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దాంట్లో ఒక రకమైన బాల పోషకాలు కలిగిన మెడిసిన్ ఉంటుంది. కాబట్టి దాన్ని తినటం లబ్ధిదారులు ఆరోగ్యకరంగా ఉంటారు.
బానోతు హుస్సేన్
మాజీ వార్డు మెంబర్ టిఆర్ఎస్ పార్టీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ పథకాన్ని నిరుపేద కుటుంబాలు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు ప్రవేశపెట్టిన పథకాన్ని కొంతమంది దళారులు పక్క దారి పట్టిస్తున్నారు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.