23-10-2025 10:10:53 PM
సిపిఐ రాష్ట్ర నేత పుల్లారెడ్డి పిలుపు
మణుగూరు (విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత వసంత ఉత్సవాల ముగింపు సందర్భంగా డిసెంబర్ 26న జరిగే చారిత్రక సభకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన మండల, పట్టణ కౌన్సిల్ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం బహిరంగ సభ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనున్నదని తెలిపారు. లక్షలాది మందితో జరిగే బహిరంగ సభకు 40 దేశాల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.
ప్రజలు తరలివచ్చేలా ప్రత్యేక కళారూపాలతో ఇంటింటి ప్రచారం చేయాలని సూచించారు. ప్రతీ ఇంటికి శతాబ్ది ఉత్సవాల సందేశాన్ని అందించాలని కోరారు. గ్రామ గ్రామాన సభలు, సమావేశాలు నిర్వహించి యువతను కార్యోన్ముఖులను చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్న లక్ష్మీ కుమారి, రాజబాబు, దుర్గ్యాల సుధాకర్, మోహన్ రావు, సొందే కుటుంబరావు, ఎడారి రమేష్, భిక్షం, వెంకటేశ్వర్లు, సమ్మక్క, నిర్మల, సుజాత, నరేష్ పాల్గొన్నారు.