calender_icon.png 24 October, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలేకరుల ముసుగులో అక్రమ వసూళ్లు

23-10-2025 10:25:19 PM

ముగ్గురు అరెస్ట్

మెట్ పల్లి (విజయక్రాంతి): విలేకరుల ముసుగులో అమాయక ప్రజలను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ మెట్ పల్లి మండలంలోని మెడిపల్లి గ్రామానికి చెందిన తారి రాజశేఖర్ ఎల్ పి న్యూస్ యూట్యూబ్ చానల్, ఇబ్రహింపట్నం మండల కేంద్రానికి చెందిన బోడా దివాకర్ జనం పవర్ పేపర్, మెట్ పల్లి పట్టణానికి చెందిన నన్నపు రవిరాజు విశ్వంబర వీక్లీ పేపర్ అనే ముగ్గురు వ్యక్తులు గత కొన్ని రోజులుగా విలేకరులుగా నటిస్తూ ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. రెండు రోజుల క్రితం పెర్కిట్ గ్రామానికి చెందిన తిరుమలశెట్టి జై బాబు తన తండ్రి నాగేశ్వరరావుతో కలిసి టిఎస్-07-యుబి-2417 నంబర్ గల లారీ ద్వారా ఇసుక వ్యాపారం చేస్తుంటారు.

ఈ నెల  21న రాత్రి 11:30 గంటల సమయంలో మెట్ పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో లారీ ద్వారా ఇసుక రవాణా జరుగుతున్న సమయంలో తారి రాజశేఖర్, బోడా దివాకర్, నన్నపు రవిరాజు వారి రెండు మోటార్ సైకిల్ ల పై లారీని అడ్డగించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని న్యూస్ పేపర్‌లో రాస్తామని, అలాగే చంపుతామని బెదిరించి పది వేలు డిమాండ్ చేశారు.దింతో భయంతో బాధితులు ఐదు వేలు నగదు ఇచ్చారు. మిగిలిన ఐదు వేలు కూడా ఇవ్వాలని నిందితులు మరింత బెదిరింపులకు పాల్పడ్డారు. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ముగ్గురు నిందితులు తమ మోటార్ సైకిళ్లపై పరారయ్యారు. పిర్యాది తిరుమలశెట్టి జై బాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి వెంకటరావుపేట్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. వారి వద్ద నుండి మూడు మొబైల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్లు, పదిహేను వందల నగదు స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. విలేకరుల ముసుగులో అమాయక ప్రజలను బెదిరించి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అక్రమ వసూళ్లకు పాల్పడే వ్యక్తులపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోబడతాయి.