06-05-2025 12:42:06 AM
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): గౌడ కులస్తులు రాజకీయంగా ఎదగాల్సిన ఆవశ్యకత ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. తాను ఒక గౌడ్‌గా పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. సోమవారం గాంధీభవన్‌లో గౌడ సామాజిర వర్గం నేతలు పీసీసీ చీఫ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మహేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఖమ్మం పట్టణంలో నిర్మించబోయే గౌడ సంఘం భవనం భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి భవనం నిర్మాణంపై చర్చిస్తామని తెలిపారు. నిధులు ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీనిచ్చారు. రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ కుల గణనను పారదర్శకంగా పూర్తి చేశారన్నారు. బీసీలు 56 శాతం ఉన్నారని కుల సర్వేలో తేలిందన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గతంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టానని మహేష్‌కుమార్ గుర్తు చేశారు.
మన్మోహన్‌సింగ్ ఫెలోషిప్ కరపత్రం ఆవిష్కరణ..
ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టబోయే మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఫెలోషిప్ కరపత్రాన్ని మహేశ్‌కుమార్ ఆవిష్కరించారు. ప్రొఫెషన్‌లో స్థిరపడిన తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి ఫెలోషిప్ కార్యక్రమం ఒక మంచి అవకాశంగా ఉంటుందన్నారు. ప్రజా సేవ చేసేందుకు మన్మోహన్‌సింగ్ ఫెలోషిప్ గొప్ప వేదిక అవుతుందన్నారు.