calender_icon.png 24 May, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టభద్రుల్లో పరిశ్రమలకు కావాల్సిన స్కిల్ ఉండాలి!

24-05-2025 01:49:19 AM

-ఆ దిశగా కోర్సులు అందించాలి

-మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడి

-ఎమర్జింగ్ కోర్సుల శిక్షణకు నాస్కామ్‌తో  తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంవోయూ

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): పరిశ్రమల అవసరాలకు సరిపడే, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న నైపుణ్యాలు పట్టభద్రుల్లో తప్పనిసరిగా ఉండాలని ఐటీ పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆ దిశగా ప్రతీ గ్రాడ్యుయేట్‌కు పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలను అందించాలని పేర్కొన్నారు.

మాసాబ్‌ట్యాంక్‌లోని విద్యామండలి కార్యాలయంలో ఎమర్జింగ్ కోర్సుల శిక్షణకు శుక్రవారం నాస్కామ్‌తో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంవో యూ కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు ఐటీఐలను అధునాతన శిక్షణా కేంద్రాలుగా మార్చామన్నారు. హైదరాబాద్‌ను భారతదేశ నైపుణ్య రాజధానిగా, నైపుణ్యాలకు కేంద్ర బిందువుగా మార్చే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులకు ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్‌లతోపాటు, మార్కెట్ డిమాండ్ నైపుణ్యాలను అందించడం ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించొచ్చని ఆయన చెప్పారు. ఈ ఒప్పందం పట్టభద్రుల్లోని నైపుణ్యాన్ని మరింత పెంచేలా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారులు, నాస్కామ్ ప్రతినిధులను మంత్రి ప్రశంసించారు.

ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ, డిజిటల్ మార్కెటింగ్ లాంటి కోర్సులకు నాస్కామ్ శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉద్యోగ అకాశాలనూ కల్పించనుందని వివరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లను ఆయా కంపెనీలే నేరుగా అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పిస్తాయని తెలిపారు.

కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఈ పురుషోత్తమ్, ప్రొఫెసర్ ఎస్‌కే మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్, జేఎన్టీయూ, కాకతీయ వర్సిటీ, ఎంజీయూ వర్సిటీ, బాసర ట్రిపుల్ ఐటీ వీసీ, ఓయూ అధికారులతోపాటు, నాస్కామ్ ప్రతినిధులు డాక్టర్ అభిలాషా గౌర్, డాక్టర్ సంధ్యా చింతల, శ్రీకాంత్ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.