23-05-2025 12:50:16 AM
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
నిజామాబాద్, మే 22 (విజయక్రాంతి) : అకాల వర్షాలు కురుస్తున్న దృష్ట్యా వరి ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో అకాల వర్షాలు, వరి ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ సీజన్ సన్నద్ధం అంశాలపై సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా సీ.ఎస్ మాట్లాడుతూ, మరో రెండు, మూడు రోజుల పాటు అకాల వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నం దున అధికారులు అప్రమత్తంగా ఉండి జన జీవనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఖరీఫ్ సీజన్లో అవసరమైన విత్తనాలు, ఎరువులు ముఖ్యంగా యూరి యా కొరత లేకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. లోతట్టు ప్రాంతాలు, వాగుల వైపు ఎవరు వెళ్లకుండా భద్రతా చర్యలు చేపట్టాలని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.
జిల్లాలలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయాగౌడ్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు అరవింద్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారిణి గంగవ్వ, డీసీఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.