14-11-2025 01:34:04 AM
హుజూర్ నగర్, నవంబర్ 13: రైతుల సంక్షేమంలో భాగంగా సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం హుజూర్ నగర్ మండల పరిధిలోని వేపలసింగారం పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సీరియల్ రిజిస్టర్ ను పరిశీలించి రైతులు ఎంతమంది ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చారని రైతుల వివరాలు తెలుసుకున్నారు.ధాన్యం తేమ శాతం 17 రాగానే ధాన్యం శుభ్రపర్చి కాంటా వేసి మిల్లులకు తరలిస్తున్నామని నిర్వాహకులు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...సూర్యాపేట జిల్లాలో భూ భారతి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు.
ప్రతి రోజు భూ భారతి,ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో 338 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా మౌళిక వసతులు కల్పించామన్నారు.రైతులు నాణ్యమైన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ పొందాలన్నారు.
జిల్లాలో నేటి వరకు 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసి 48 గంటలలోపు రైతుల అకౌంట్ లో నగదు జమ అయ్యేలా చూస్తున్నామన్నారు. అంతకుముందు హుజూర్ నగర్ పట్టణంలోని పనిగిరి రామస్వామి గుట్ట వద్ద ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మోడల్ కాలనీ ఇండ్లను పరిశీలించి మాట్లాడారు...పేదవారి సొంటింటి కలను నేరెవెర్చేందుకు సింగిల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు...ఏటీసీ ద్వారా మంచి నైపుణ్యాలు నేర్చుకొని ఉపాధి కల్పన పొంది జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల,ఆర్ అండ్ బి అతిధి గృహం నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, హౌజింగ్ పిడి సిధార్థ, ఎంపిడిఓ సుమంత్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి,డిఈ జంగయ్య, డిప్యూటీ తహసీల్దార్ నాగేందర్, ఏఈ సాయి రాంరెడ్డి,వర్క్ ఇన్స్ పెక్టర్ అబ్దుల్లా,తదితరులు, పాల్గొన్నారు.