10-12-2025 07:47:59 PM
నకిరేకల్ (విజయక్రాంతి): కట్టంగూర్ మండల పరిధిలో గురువారం జరగనున్న గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో పెరుమాళ్ల జ్ఞానప్రకాశ రావు బుధవారం తెలిపారు. మండలంలోని మొత్తం 22 గ్రామ పంచాయితీలలో మల్లారం, దుగినవెల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 20 గ్రామ పంచాయితీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొత్తం ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆయన తెలిపారు. మండలంలో ఏర్పాటు చేసిన 201 పోలింగ్ కేంద్రాల్లో విధుల నిర్వహణకు 201 మంది స్టేజ్-2 పోలింగ్ అధికారులు, 486 మంది ఓపీఓలు, 130 మంది పోలీసు సిబ్బంది సహా మొత్తం 817 మంది సిబ్బందిని నియమించినట్లు వివరించారు. అదనంగా పర్యవేక్షణ కోసం నలుగురు జోనల్ అధికారులను నియమించారు.
పోలింగ్ సిబ్బంది రవాణా కోసం ఎనిమిది రూట్లలో 15 ప్రైవేట్ స్కూల్ బస్సులను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది బుధవారం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌కు చేరుకుని రిపోర్ట్ చేసి, అనంతరం పోలింగ్ సామగ్రిని స్వీకరించి పోలీసులు ఏర్పాటు చేసిన భద్రతా బందోబస్తుతో ఆయా గ్రామాల పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారని ఆయన తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలలో ఎలాంటి అసౌకర్యాలు ఎదురుకాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. బుధవారం సాయంత్రం నుంచే అన్ని పోలింగ్ కేంద్రాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మండలంలో 76 మంది సర్పంచ్ అభ్యర్థులు, 460 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు గురువారం జరిగే ఓటింగ్ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్పలత, ఎస్సై రవీందర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు