04-01-2026 12:42:20 AM
ముంబై, జనవరి 3: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. జనవరి 15న ఓటింగ్ జరగాల్సి ఉండ గా, రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపల్ కార్పొరేషన్లలో 68 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఈ ఫలితాలను అధికారులు వెల్లడించారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు బరి నుంచి తప్పుకోవడంతో అధికార కూటమి అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకలా మారిం ది.
ఈ భారీ విజయంపై మహాయుతి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏకగ్రీవమైన ఈ 68 స్థానాల్లో బీజేపీ అత్యధికంగా 44 సీట్ల ను దక్కించుకుంది. థానే జిల్లాలోని కల్యాణ్-డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీకి ఎక్కువ స్థానాలు లభించాయి. పూణే, పింప్రి చించ్వాడ్, పన్వెల్, భివాండీ వంటి కీలక నగరాల్లో కూడా బీజేపీ జెండా ఎగురవేసింది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 22 స్థానాలను కైవసం చేసుకుంది.
అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ రెండు చోట్ల విజయం సాధించింది. పుణేలోని 35వ వార్డులో ఇద్దరు బీజేపీ అభ్యర్థులు పోటీ లేకుండానే ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఫలితాలు తమ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ పేర్కొన్నారు. వచ్చే మేయర్ ఎన్నికల్లో కూడా తమ పార్టీనే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ జనాకర్షణ, పార్టీ రాష్ట్ర విభాగం వ్యూహాల వల్లే ఈ విజయం సాధ్యమైందని బీజేపీ ప్రతినిధులు చెబుతున్నారు.