14-01-2026 02:49:33 AM
న్యూఢిల్లీ, జనవరి 13: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించ డం వల్ల మున్ముందు భారత్ ముప్పువాటిల్లే అవకాశం ఉందని జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఒకప్పుడు బంగ్లాదేశీయులు తమకు పాకిస్తాన్ నుంచి విముక్తి కల్పించినప్పుడు భారత్‌కు కృతజ్ఞులై ఉండేవారని, కానీ..
ఇప్పుడు పరిస్థితులు మారిపోయారని, ఇప్పుడా దేశ ప్రజలు భారత్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారని పేర్కొన్నారు. భారత్‌పై ద్వేషంతో ఇప్పటికే అక్కడి మైనార్టీ వర్గమైన హిందువులపై దాడులు పెరిగాయని, అల్లరి మూకలు ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సొంత ప్రజలు తిరస్కరించిన షేక్ హసీనాకు భారత్ ప్రత్యేక గౌరవం ఇవ్వడం వల్ల బంగ్లాదేశ్ ప్రజలు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని అభిప్రాయపడ్డారు. హిందువులపై దాడులు జరగ డానికి ఇదొక కారణమని ప్రకటించారు. షేక్ హసీనాకు భారతదేశం సాయం అందించడంలో తప్పులేదని, కానీ..
అది అక్కడి సాధారణ హిందువుల ప్రాణాలకు ముప్పు తెచ్చే లా ఉండకూడదని స్పష్టం చేశారు. ఆమెకు ఆశ్రయం కల్పించడం కంటే దేశ ప్రయోజనాలు, భద్రతకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. గో రక్షణపై ఆయన స్పందిస్తూ.. అంతరించిపోతున్న దేశీ గోవుల జాతులను కాపాడుకోవాలని స్వామిజీ దేశప్రజలకు పిలుపునిచ్చారు. గోవులకు ఎవరు హాని తలపెట్టినా తప్పేనని, ఆ చర్యను ఏ విధంగానూ సమర్థించలేమని తెలిపారు.
గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంపై మహ్మద్ గజనీ దాడి చేసి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భాన్నీ ఆయన గుర్తు చేశారు. దురాక్రమణదారులు విగ్రహాలను, భవనాలను కూల్చగలరేమో కానీ, దైవాన్ని ఓడించలేరని సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ నిరూపిస్తోందని ఉద్ఘాటించారు.అలాగే ఇండోర్‌లో కలుషిత నీరు తాగి 15 మంది చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని ఆయన విమర్శించారు.