18-07-2025 12:00:00 AM
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హుస్నాబాద్, జులై 17 : ఆయిల్ పామ్ సాగుతో తెలంగాణ పచ్చబడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగుతో విద్యుత్, నీరు కూడా ఆదా అవుతాయని, రైతులు ఈ కొత్త పంట సాగు చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజా పాలన ప్రభుత్వంలో 12 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆగస్టు 15లోపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని ప్రకటించారు. వరి పంటకు ఉండే రాళ్ల వర్షం వంటి సమస్యలు ఆయిల్ పామ్ సాగులో ఉండవని, ఎకరం వరికి ఇచ్చే నీటితో 5 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయవచ్చని వివరించారు.
బయటి దేశాల నుంచి వచ్చే ఆయిల్ సుంకం తగ్గించడం వల్ల ఆదాయం తగ్గిందని, దక్షిణ భారత మంత్రులతో కలిసి ప్రధానిని కలిసి, క్వింటాల్కు రూ.25,000 ఇవ్వాలని కోరనున్నట్లు తెలిపారు. రిఫైన్డ్ ఫ్యాక్టరీని కూడా ఇక్కడే నెలకొల్పుతామని, హుస్నాబాద్ ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్రానికే గుండెకాయ అవుతుందని, ఉద్యోగాలు కూడా పెరుగుతాయని అన్నారు. ఆయిల్ పామ్ కటింగ్ పై శిక్షణ ఇవ్వాలని, ఈ పనిలో కొత్తవారికి కలెక్టర్ జీతం కన్నా ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు.
గౌరవెల్లి’ని పూర్తి చేస్త : మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి పంటలకు నీళ్లు ఇచ్చే బాధ్యత తనదే అన్నారు. ఆయిల్ పామ్, డ్రాగన్ వంటి అధిక ఆదాయాన్నిచ్చే పంటలు వేసి రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ పామ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, జిల్లా కలెక్టర్ హైమవతి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.