24-09-2025 01:33:31 AM
తెలంగాణకు ౭వేల కోట్ల నష్టం
మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : గత ఎనిమిదేళ్లుగా జీఎస్టీ పేద ప్రజల రక్తం తాగిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పు డు జీఎస్టీ తగ్గించి పేదలకు లబ్ది చేసినట్లుగా బీజేపీ నాయకులు బిల్డప్ ఇస్తున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. జీఎస్టీ అంటే గబ్బర్‌సింగ్ ట్యాక్స్ అని తమ నాయకుడు రాహుల్‌గాంధీ మొదటి నుంచి చెబుతున్నాడని, పేదల సొమ్మను దోచుకోవడానికే జీఎస్టీ తెచ్చారని మంత్రి విమర్శించారు.
జీఎస్టీ తగ్గింపు అనేది ఎన్నిక డ్రామానేనని మంత్రి ఆరోపించారు. మంగళవారం మంత్రి పొన్నం గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్, నాయకులు బొల్లు కిషన్, శ్రీకాంత్ యాదవ్, వినోద్‌తో కలిసి మీడియాతో మా ట్లాడారు. శవ పేటికలు, పసి పిల్లల తిను బండారాల పైన కూడా జీఎస్టీ వేశారని విమర్శించారు. జీఎస్టీ ట్యాక్స్‌తో ఏదైనా మంచి పని చేశారా..? ఆర్థిక సంక్షో భం నుం చి తప్పించుకోవడానికే మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెలిపారు.
తెలంగాణకు రూ. 7 వేల కోట్ల నష్టం వస్తుందని, దీన్ని పూడ్చే బాధ్యత కేంద్ర ప్రభు త్వానిదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు బీజేపీ ఎంపీలు తెలంగాణకు వస్తున్న నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారో చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.