calender_icon.png 24 September, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణాలో 70% వాటా

24-09-2025 12:59:11 AM

  1. కృష్ణా ట్రైబ్యునల్‌లో మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో తెలంగాణ తుది వాదనలు 
  2. నదీ జలాల్లో హక్కుల కోసం రాజీలేని పోరు 
  3. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకుని తీరుతాం.. సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తాం 
  4. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : కృష్ణా జలాల్లో తెలంగాణకు 70శాతం వాటా కావాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా రావాలని కృష్ణా జలా ల వివాదాల ట్రైబ్యునల్--॥ (కేడబ్ల్యూడీటీ-2) ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తోందని, మొత్తం 1050 టీఎంసీలలో దాదాపు 70శాతం అంటే 763 టీఎంసీలను రాష్ట్రానికి కేటాయించాలని ఆయన కోరారు.

మంగళవారం ఢిల్లీలో మళ్లీ ప్రారంభమైన కృష్ణా ట్రైబ్యునల్ విచా రణలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసు చివరి దశకు చేరుకుందని, ఫిబ్రవరి నుంచి తెలంగాణ తుది వాదనలు వినిపిస్తున్నదని చెప్పారు. ఈ విచారణ సెక్షన్- 3 రిఫ రెన్స్ కింద జరుగుతున్నదని, అన్ని పిటిషన్లు పూర్తయ్యాయని కొన్ని నెలలుగా సీనియర్ అడ్వకేట్ ఎస్.వైద్యనాథన్ తెలంగాణ తరఫున వాదనలు వినిపిస్తున్నారని చెప్పారు.

ఆయనకు మూడు రోజుల సమయం కేటాయించినట్టు తెలిపారు. కృష్ణా ట్రైబ్యునల్ ముందు స్వయంగా నీటి పారుదల శాఖ మంత్రి హాజరుకావడం బహుశా దేశంలో ఇదే మొదటి సారి అయి ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని ఎంతగానో సీరియస్‌గా తీసుకుంతుందో అర్థం అవుతుందని పేర్కొన్నారు. 

చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దుతాం

తెలంగాణకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దేందుకు కృషిచేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత కేటాయింపులను వివరించిన ఉత్తమ్, కేడబ్ల్యూడీటీ-2 అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1005 టీఎంసీలు కేటాయించిందని గుర్తు చేశారు. వీటిలో 811 టీఎంసీలు 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా, 49 టీఎం సీలు 65 శాతం డిపెండబిలిటీ ఆధారంగా, 145 టీఎంసీలు సగటు ప్రవాహాల ఆధారంగా కేటాయించినట్టు వివరించారు.

అదనంగా గోదావరి డైవర్షన్ ద్వారా 45 టీఎంసీలు ఇచ్చారని, మొత్తంగా 1050 టీఎంసీలు కేటాయించినట్టు పేర్కొన్నారు. సగటు ప్రవాహాల కంటే ఎక్కువగా వచ్చే నీటిని వినియోగించుకోవచ్చని కూడా స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలిపారు. 2014లో తెలంగాణ వేరుగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్తగా బేసిన్ పారామీటర్ల ఆధారంగా వాటాను కోరుతోందని చెప్పారు. తెలంగాణ డిమాండ్ శాస్త్రీయమైనదని, అంతర్జాతీయంగా అంగీకరించిన పారామీటర్ల మీద ఆధారపడి ఉందని స్పష్టం చేశారు.

క్యాచ్‌మెంట్ ఏరియా, బేసిన్‌లోని జనాభా, కరువు ప్రాంతం విస్తీర్ణం, సాగు భూములు వంటి అంశాల ఆధారంగా లెక్కలు వేసి 75 శాతం డిపెండబుల్ వాటర్‌లో 555 టీఎంసీలు, 65 శాతం డిపెండబుల్ వాటర్‌లో 43 టీఎంసీలు, సగటు ప్రవాహాల నుంచి 120 టీఎంసీలు, గోదావరి డైవర్షన్ నుంచి మొత్తం 45 టీఎంసీలు తెలంగాణకు రావాలని కోరుతున్నారని, మొత్తంగా ఇది 763 టీఎంసీలు అవుతుందని వివరించారు.

గత ప్రభుత్వ అంగీకారంతోనే అన్యాయం 

ఆంధ్రప్రదేశ్ తనకు కేటాయించిన 811 టీఎంసీల్లో పెద్ద భాగాన్ని బేసిన్ వెలుపలికి మళ్లించిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఇలాంటివి ఆపాలని, బదులుగా ప్రత్యామ్నాయ వనరులను వినియోగించాలని ట్రైబ్యునల్ ముందు తెలంగాణ విన్నవించుకుందన్నారు. సగటు ప్రవాహాలపై మిగిలిన మొత్తం నీటిని వినియోగించే హక్కు తెలంగాణకే ఉందని, దీన్ని ట్రైబ్యునల్ ముందు బలంగా వాదిస్తామని చెప్పారు.

ఇది కేవలం ఒక డిమాండ్ మాత్రమే కాదని, దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిచేసే చర్య అని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం 299 టీఎంసీలను తెలంగాణకు కేటాయిస్తూ, 512 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ఒప్పందాన్ని అంగీకరించి రైతులు, కరువు ప్రాంతాలకు మోసం చేసిందని విమర్శించారు. దాదాపు పది సంవత్సరాల పాటు బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఆ ఒప్పందాన్ని అంగీకరించిందని గుర్తుచేశారు.

అందుకే ఇప్పుడు ఆ ఫైలును మళ్లీ తెరిచి మొదటి నుంచి వాదనలు వినిపిస్తున్నామని, 299 టీఎంసీలు అంగీకరించిన గత ఒప్పందం, మేం కోరుతున్న 763 టీఎంసీల మధ్య వ్యత్యాసమే ఈ అన్యాయానికి నిదర్శనమని పేర్కొన్నారు. జలశక్తి మంత్రిత్వశాఖలో కూడా ఆ ఒప్పందం నమోదైనప్పటికీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా తిరస్కరించిందని చెప్పారు. 

పొరుగున ఎవరున్నా రాజీ పడేది లేదు 

పొరుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ రాజీపడబోదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ‘కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఉన్నా, మహారాష్ర్టలో బీజేపీ ఉన్నా.. తెలంగాణ తన హక్కుల కోసం పోరాడుతుందని, ఒక్క చుక్క నీళ్లను కూడా వదులుకోదని తేల్చిచెప్పారు. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచే కర్ణాటక యోచనను తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తామని తెలిపారు.

ఇది కేవలం న్యాయ పోరాటం మాత్రమే కాదు, రైతుల జీవనాధారానికి, కరువు ప్రాంతాల భవిష్యత్‌కు సంబంధించినదని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ న్యాయమూర్తి బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని విచారణలో తెలంగాణకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాము తమ వాదనలను అన్ని ఆధారాలతో సమర్పించామని, ఈ సారి తెలంగాణకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.