calender_icon.png 24 September, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం కీర్తిని ప్రపంచానికి చాటుతాం నిధులకు వెనుకాడం

24-09-2025 01:03:48 AM

వందల ఏళ్లు ఉండేలా, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా రాతితో ఆలయ నిర్మాణం

  1. వంద రోజుల్లోనే పూర్తి చేయాలి 
  2. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు
  3. మేడారానికి జాతీయ హోదా కల్పించి, నిధులు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి
  4. వనదేవతలను దర్శించుకుని, తులాభారంలో 68 కిలోల బంగారం మొక్కు తీర్చుకున్న సీఎం 
  5. మేడారం ఆలయ అభివృద్ధిపై సమీక్ష 
  6. ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన
  7. హాజరైన మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్

ములుగు, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): మేడారం కీర్తిని ప్రపంచానికి చాటుతామని, రాబోయే వందల ఏళ్లపాటు శాశ్వతంగా ఉండేలా, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా రాతితో ఆలయ పునర్మిర్మాణం చేపడుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. -నిధులకు వెనుకాడబోమని, పనులు ప్రారంభించి వంద రోజుల్లోనే పూర్తి చేసి, మేడారం జాతర నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కుంభామేళాకు ఇచ్చినట్టుగా మేడారానికి జాతీయ హోదా కల్పించి, నిధులు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో మం గళవారం మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. వనదేవతలను దర్శించుకుని, తులాభారం 68 కిలోల బంగారం(బెల్లం) మొక్కు తీర్చుకున్నారు. అనంతరం మేడారం ఆలయ అభి వృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అలయ అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్లను పూజారులు, ఆదివాసీ సంఘాలకు అధికారులు వివరించారు.

సమావేశంలో ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభి ప్రాయాలు సీఎం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకునే ఆలయ అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు. సమ్మక్క గద్దెలు రాబోయే వందల సంవత్సరాలకు ఆదర్శంగా నిలవాలని, అందుకే ఈ ప్రాంగణంలో సిమెంట్ కట్టడాలకు బదులు రాతి కట్టడాలతో శాశ్వత నిర్మా ణాలు చేపడతామని చెప్పారు.

నాడు కాకతీయుల కాలంలో రుద్రదేవుడు కట్టించిన రామప్ప ఆలయం ఎనిమిది వందల సంవత్సరాలైనా నిలిచి ఉన్నట్టుగానే మేడారంలోని నిర్మాణాలు కూడా వందల ఏళ్లు నిలవాలని ఆకాక్షించారు. ఈ అభివృద్ధి పనులు 100 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జంపన్న వాగులో నీటి నిల్వ ఉండే లా సాగునీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైనచోట చెక్ డ్యామ్‌లు నిర్మించాలని ఆదేశిం చారు.

రాబోయే వంద రోజులు సమ్మక్క మాలధారణ చేసినట్లుగా నిష్ఠతో అందరూ సమాఖ్యంగా పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. నిధుల విడుదలకు ప్రభుత్వం వెనుకాడబోదని, సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ టీమ్ ద్వారా అభివృద్ధి చేయాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 మధ్య జరిగే మహాజాతర నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 

అభివృద్ధిలో ఆదివాసీ సంప్రదాయాలకు ప్రాధాన్యం

ఆదివాసీలు దేశానికి మూలవాసులు అని, పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క, సారలమ్మలు అని సీఎం రేవంత్ కొనియాడారు. మేడారం అభివృద్ధిలో ఆదివాసీ సం ప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రణాళికలు ప్రభుత్వం చేస్తోందిగానీ సాంప్రదాయాలు ఆదివాసులవి అని, నిర్మాణం నుం చి సంరక్షణ వరకు ఆదివాసీల భాగస్వామ్యంతోనే కొనసాగిస్తాం అని సీఎం తెలిపారు.

పరిశోధకులు, వారసులు, స్థానిక గిరిజన ప్రతినిధులు నిర్మాణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అమ్మవార్లను సందర్శిస్తు న్నానని, ఫిబ్రవరి 6, 2023న ఈ గడ్డమీద నుంచే పాదయాత్ర మొదలుపెట్టి, సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు.

ఆదివాసీ సంప్రదాయంలో వీసమెత్తు కూడా తేడా రాకుండా ఉండాలనేదే తమ అభిమతమని వెల్లడించారు. ఇది డబ్బులతో కొలిచేది కాదని, నమ్మ కంతో కొలిచేదని, ఈ నమ్మకాన్ని మరింత పెంచేలా అభివృద్ధి ఉండాలని అధికారులకు సూచించారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వాములైన వారి జన్మ ధన్యమవుతుందని చెప్పా రు. ఇలాంటి అవకాశం ఈ జన్మకు దక్కిన వరం లాంటిదన్నారు. 

సీఎం కృషితో మరింత అభివృద్ధి: మంత్రి సీతక్క

పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మా ట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్రాంతం శాశ్వతాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. అభివృద్ధి కార్యక్రమా లతో మేడారం గద్దెల ప్రాంగణం కొత్త అందచందాలతో అలంకరించబడనుందని, రాబో యే జాతర నాటికి యావత్ దేశం, ప్రపంచం నుంచి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మె ల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారా యణరావు, రాష్ర్ట అయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పాల్గొన్నారు. 

మేడారానికి జాతీయ హోదా కల్పించాలి

లక్షలాది మంది ప్రజలు దర్శించుకునే మేడారం ఆదివాసీ జాతరకు కుంభమేళా తరహాలో జాతీయ హోదా ఇచ్చి, మేడారం అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. ఉత్తరప్రదేశ్ అయోధ్యకు లభిస్తున్న గుర్తింపు, సహకారంలాగే తెలంగాణ ములుగు అడవుల్లో ఉన్న సమ్మక్క--సారలమ్మ జాతర కూడా దేశ పండుగగా గుర్తింపును ఇవ్వాలని విన్నవించారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ కార్యక్రమంపై తల్లుల ఆశీర్వాదం ఉన్నదని, అందుకే వాతావరణం అనుకూలించిందని సీఎం చెప్పారు.