calender_icon.png 24 September, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్‌లో భారీ వర్షం

24-09-2025 01:25:39 AM

  1. పొంగిన వాగులు 
  2. రోడ్లపై నిలిచిన నీళ్లు 
  3. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

మహబూబాబాద్/హనుమకొండ, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురసింది. సోమవారం రాత్రి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమై రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 10.4 సెంటీమీటర్ల వర్షం కురవగా కాజీపేటలో 7.6, ధర్మ సాగర్ లో 6.2 ఎలుకతుర్తిలో 6.0, హనుమకొండలో 5.6లో 5.1 సెంటీమీటర్ల వర్షపా తం నమోదయ్యింది.

హనుమకొండలోప్రధాన రహదారులు మొదలుకొని అంతర్గత వీధుల్లో వరద ప్రవహించడంతో వాగులను తలపించాయి. హనుమకొండ చౌరస్తాలో వర్షం భారీగా కురవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. అలాగే ఆర్టీసీ బస్టాండు పూర్తిగా వరదతో నిండి చెరువుగా మారింది. అలాగే ఇందిరమ్మ కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. వరదతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మహబూబాబాద్ జిల్లాలో..

మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, కేసముద్రం మండలాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. డోర్నకల్‌లో 7.3 సెం.మీ.లు, సెంగార్లలో 6.5 సెం.మీ.లు, కేసముద్రంలో 6.2 సెంటీమీటర్ల వర్షం కురిసిం ది. మహబూబాబాద్, గూడూర్, మరిపెడ, బయ్యారం, నరసింహుల పేట, చిన్న గూడూరు మండలాల్లో మూడు సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఫలితంగా వాగులు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.

కేసముద్రం వద్ద వట్టి వాగు బ్రిడ్జి పైనుండి పొంగి ప్రవహించడంతో గూడూర్, కాట్రపల్లి వైపు రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షానికి చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. వాగులన్నీ ఉద్ధృతంగా ప్రవహించాయి. వివిధ మార్గా ల్లో మంగళవారం ఉదయం రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఆర్టీసీ సర్వీసు లను కూడా వరద కారణంగా నిలిపివేశారు.

కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామస్తులు అర్పణ పల్లి మీదుగా మండల కేంద్రానికి రావడానికి మద్దెల వాగు పొంగి ప్రవహించడంతో మరో మార్గం వెంకటగిరి ద్వారా రాకపోకలు సాగించారు. జనగామ జిల్లాలో సైతం భారీ వర్షం కురిసింది. అత్యధికంగా నర్మెట్టలో 10.1 సెంటీమీటర్ల వర్షం కురవగా స్టేషన్ ఘనాపూర్ లో 5.9, తరిగొప్పుల, జఫర్గడ్, జనగామలో సైతం మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. 

రైస్‌మిల్లు గోడ కూలి తండ్రి, కూతురు దుర్మరణం

కామారెడ్డి(విజయక్రాంతి): ఇంట్లో నిద్రిస్తున్న వారిపై రైసుమిల్లు గోడ కూలడంతో తండ్రీకూతురు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా కోటగిరి మండల కేంద్రంలో జరిగింది. కోటగిరిలోని ఎస్సీ కాలనీలో రేకు ల షెడ్డులో మహేష్ కుమార్, అతని భార్య, కూతురితో జీవిస్తున్నాడు. ఆయన ఇంటి పక్కన శిథిలావస్థకు చేరిన రైస్‌మిల్లు ఉంది.

సోమవారం రాత్రి వారు ఇంట్లో నిద్రిస్తుండగా.. మంగళవారం తెల్లవారుజామున రైస్‌మిల్లు గోడ కూలి మహేష్ కుమార్ ఇంటిపై పడింది. ఈ ఘటనలో మహేష్‌కుమార్, అతని కూతురు మరణించారు. భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. శిథిలావస్థలో ఉన్న రైస్ మిల్లును తొలగించాలని యజమానులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని కాలనీవాసులు వాపోయారు. 

శ్రీశైలంలానికి పెరుగుతున్న వరద

పది గేట్లు కెత్తి దిగువకు నీటి విడుదల

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): శ్రీశైలానికి భారీగా వరద నీరు పోటెత్తుతున్నది. ఎగువ నుంచి జూరాల మీదుగా శ్రీశైలానికి నిత్యం మూడు లక్షల పైచిలుకు క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. అధికారులు 10 గేట్లు 12 ఫీట్ల మేర పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 215 టీఎంసీలు, 885 అడుగుల సామర్థ్యం గల శ్రీశైలం ప్రస్తుతం 204.7889 టీఎంసీలు  883 అడుగుల వద్ద నీటి సామర్థ్యం కొనసాగుతోంది. 

మరో ఐదు రోజులు భారీ వర్షాలు

  1. బంగాళఖాతంలో అల్పపీడనం 
  2. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 
  3. రేపు ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): మరో ఐదు రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ప్రభావం కొనసాగుతుందని తెలిపింది. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుందని సూచించింది.

పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీర ప్రాంతాలు, ఉత్తర ఒడిశా, వాయువ్య బంగాళాకాతం నుంచి తెలంగాణ మీదుగా ఒడిశా వరకు ద్రోణి కొనసాగుతందని పేర్కొంది. దీంతో వరుసగా రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది.

ఈ నెల 26న ఏపీ తీరాన్ని ఆనుకొని వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశముందని పేర్కొంది. రెండో అల్పపీడనం తర్వాత కూడా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 28 వరకు రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి.

బుధవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, వికారబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.