calender_icon.png 24 September, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం సేకరణ లక్ష్యం.. 75లక్షల మెట్రిక్ టన్నులు

24-09-2025 12:14:32 AM

  1. వానాకాలంలో వరి 159.15 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా
  2. రాష్ట్ర వ్యాప్తంగా 8,332 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
  3. వచ్చే నెల నుంచి ధాన్యం సేకరణ ప్రారంభం
  4. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) :  వరి ధాన్యం సేకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌర సరఫరాల కమిషనర్  డి.ఎస్. చౌహాన్ తెలిపారు. మంగళవారం ఆయన సివిల్ సప్లయ్‌శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వానాకా లం 2025 26 సీజన్‌కు తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం 65.96 లక్షల ఎకరాలుగా అంచనా వేశామని, 159.15 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని, ఇందులో ప్రభుత్వం  దాదాపు 75 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని భావిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

అక్టోబరులో ధాన్యం సేకరణ ప్రారంభమవుతుందన్నారు. రాబోయే సీజన్‌కు పౌర సరఫరాల శాఖ 8,332 సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వీటిలో 4,252 పీఏసీఎస్‌లు, 3,522 ఐకేపీలు, 558 ఇతర కేంద్రాలు ఉన్నాయన్నారు. గత యా సంగిలో నిజామాబాద్ జిల్లా 6.80 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణతో అగ్రస్థానంలో ఉందని, ఆ తర్వాతి స్థానాల్లో జగిత్యాల (5.0 ఎల్‌ఎంటీ), నల్లగొండ (4.76 ఎల్‌ఎంటీ) ఉన్నాయని తెలిపారు.

ఆటోమెటిక్ పాడీ డ్రైయర్, ఆటోమెటిక్ పాడీ క్లీనర్ యంత్రాలు

దేశంలోనే తొలిసారిగా వరి ధాన్యం సేకరణకు ఆటోమెటిక్ పాడీ డ్రైయర్, ఆటోమెటిక్ పాడీ క్లీనర్‌లను పౌర సరఫరాల శాఖ నియమించిం ద న్నారు. ఆటోమెటిక్ డ్రైయర్‌లు వరిలో అధిక తేమను తగ్గించడంలో, ధాన్యం నాణ్యతను నిర్వహించడంలో, పంటకోత తర్వాత నష్టాలను నివారించడంలో సహాయపడతాయన్నారు.

అంతే కాకుండా ఆటోమెటిక్ డ్రైయర్లు వరి ధాన్యాన్ని ఎండబెట్టే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు వాతావరణ పరిస్థితులపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తాయని వివరించారు. ఈ రెండు యంత్రాలను గమనించిన తర్వాత అనేక రాష్ట్రా లు వాటిపై ఆసక్తి చూపించాయని తెలిపారు.

56 అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టుల ఏర్పాటు

పీఏసీఎస్‌లలో సరిపోను టార్పాలిన్లు, ఆటోమెటిక్ ప్యాడీ క్లీనర్లు, ఆటోమెటిక్ ప్యాడీ డ్రైయర్లు, గ్రెయిన్ కాలిపర్లు, తేమ మీటర్లు, ఎలక్ట్రానిక్ వెయిజింగ్ స్కేల్స్, హస్క్ రిమూవర్లు ఉన్నాయని తెలిపారు. వరి దిగుబడిని పర్యవేక్షణకు 17 జిల్లాల్లో మొత్తం 56 అంతర్రాష్ర్ట సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ చౌహాన్ వెల్లడించారు.

ఈ చెక్‌పోస్టులను మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు,  భూపాలపల్లిలలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అకాల వర్షాలు కురిసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, పౌర సరఫరాల శాఖ ధాన్యం సేకరణకు విస్తృతమైన ఏర్పాట్లు చేసిందన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సమన్వయంతో ముందుకు వెళ్తామన్నారు.