calender_icon.png 24 September, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయుధాలు అప్పగించాలి!

24-09-2025 12:55:16 AM

మల్లోజులకు మావోయిస్టు పార్టీ హెచ్చరిక

లేదంటే ‘పీఏజీ’ స్వాధీనం చేసుకుంటుంది 

లొంగిపోయే ఉద్దేశంతోనే బహిరంగ లేఖ అని ఆరోపణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: మావోయిస్టు పార్టీ నేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతితో పాటు తన అనుచరుల వద్ద ఉన్న ఆయుధాలను పార్టీకి అప్పగించాలని, లేదంటే పీపుల్స్ గెరిల్లా ఆర్మీ (పీఏజీ) స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం పార్టీ నుంచి ప్రకటన వెలువడింది.

వేణుగోపాల్ తన బహిరంగ లేఖ ద్వారా ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రతిపాదనలను కొట్టిపడేసింది. వేణుగోపాల్ పార్టీపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పార్టీ ఆరోపించింది. వేణుగోపాల్‌కు ప్రభుత్వాలకు లొంగిపోయే ఆలోచన ఉందని, అందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడని పేర్కొంది.

వేణుగోపాల్ లేఖలోని సారాంశం..

మావోయిస్టు పార్టీ తాత్కాలికంగా ఆయుధాలు వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉందని ఈ నెల 16న పార్టీ సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాల్ పేరిట ప్రకటన విడుదలైంది. ‘ప్రపంచ గమనం, పరిస్థితులను అర్థంచేసుకోవడంలో మావోయిస్టు పార్టీ విఫలైమంది. పార్టీ అనుసరించిన అతివాద, తొందరపాటు చర్యలు అంతిమంగా శత్రువులకే ఆయుధాలయ్యాయి.

శత్రువు బలాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాం. చాలా తప్పులు చేశాం. ఫలితంగా పార్టీ బలహీనమైంది. దీంతో సంఘటిత విప్లవోద్యమాన్ని నిర్మించలేకపోయాం. మేం చేసిన తప్పులకు బాధ్యత వహిస్తున్నాం. ప్రజలకు క్షమాపణలు చెప్తున్నాం. చైనా, రష్యా పిడివాద పంథాలను ఇప్పటికైనా పార్టీ స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది’ అనేది లేఖలోని సారాంశం.