24-09-2025 12:16:49 AM
వనపర్తి, గద్వాల జిల్లాల్లో మొత్తం 7, 75,713 మంది ఓటర్లు
పంచాయతీల్లో గెలుపోటములను నిర్ణయించేది మహిళలే..
స్థానిక సంస్థల ఎన్నికలకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.. అందుకోసం వనపర్తి, గద్వాల జిల్లాలో ఓటర్ల తుది జాబితాను, గ్రామ పంచాయతీలు, వార్డులు, పోలింగ్ కేంద్రాల వివరాలను ఇప్పటికే వెల్లడించారు. అధికారులు తుది జాబితా ప్రకటించడంతో పాటు ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎన్నికల కమిషన్ షె డ్యూల్ ప్రకటించడమే తరువాయి చకచకా పనులు ముగించి ఎన్నికలకు సిద్ధం కానున్నారు.
వనపర్తి, సెప్టెంబర్ 23 ( విజయక్రాంతి ) : స్థానిక సంస్థల ఎన్నికలకు యంత్రాంగం కసరత్తు చేస్తుంది. వనపర్తి, గద్వాల జిల్లాలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించారు. వనపర్తి, గద్వాల జిల్లాల పరిధిలోని గ్రామ పంచాయతీలు, వార్డులు, పోలింగ్ కేంద్రాల వివరాలను వెల్లడించారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా వార్డులు, పోలింగ్ కేంద్రాల తో పాటు ఓట రు తుది జాబితాను విడుదల చేశారు. వనపర్తి, గద్వాల జిల్లాలో ప్రకటించిన ఓటర్ల తుది జాబితాలో పురుషులకంటే మహిళా ఓ టర్లే అధికంగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో మహిళలే కీలకం కానున్నడం తో గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నారు.
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటిస్తే నిర్వహించే విధంగా అవసరమైన ఏర్పాట్లను వనపర్తి, గద్వాల జిల్లా అధికారులు చేస్తున్నారు. రెండు జిల్లా పరిధిలో మొత్తం 28 మండలాలు ఉండగా వీటి పరిధిలో 523 గ్రామ పంచాయతీలు ఉన్నా యి. ఈ పంచాయతీల్లో 5426 వార్డులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అంతే మొత్తంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వనపర్తి, గద్వాల జిల్లాల పరిధిలో మొత్తం 7, 75,713 మంది ఓటర్లు ఉన్నారు.
వీరిలో పురుషులు 3, 83,895 మహిళలు 3, 86,120 మంది ఉన్నారు. వీరితో పాటు 14 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాలు, గ్రామ పంచాయతీల పరిధిలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను బట్టి వారి మద్దతే కీలకం కానుంది.
వార్డు, సర్పం చ్ ఎన్నికల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వారు మద్దతు ఇచ్చిన వారే గెలిచే అవకాశం ఉందని నాయకులు ఓ అంచనా కు వస్తున్నారు.. అధికారులు ప్రకటించిన తుది జాబితాకు అనుగుణంగా ప్రధాన పా ర్టీలు కూడా మహిళా ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.
వనపర్తి జిల్లా పరిధిలో ...
వనపర్తి జిల్లా పరిధిలో 15 మండలాలు, 268 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2436 వార్డులు ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం 3,82,295 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,90,068 మంది ఉండగా, మహిళ ఓటర్లు 1,92,223 మంది ఉన్నారు. ఇతరులు 04 మంది ఉన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో..
జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో 13 మండలాలు, 255 గ్రామ పంచాయతీలు, 2990 వార్డులు ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం 3,93,418 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,93,827 ఉండగా, మహిళా ఓటర్లు 1,99,781 మంది, ఇతరులు 10మందిఉన్నారు.