పాలస్తీనా ఇస్తే ఆయుధాలు వీడుతాం

26-04-2024 12:10:00 AM

1967 ముందునాటి సరిహద్దులతో ఇవ్వాలి

దేశ స్థాపనకు అంగీకరిస్తే సంధికి సిద్ధం హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు

ద్విదేశ ప్రతిపాదననువ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్

రఫాపై దాడి చేస్తామని స్పష్టం చేసిన టెల్‌అవీవ్


ఇజ్రాయెల్/వాషింగ్టన్, ఏప్రిల్ 25: ఏడు నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటివరకు 34 వేల మందికిపైగా మృతి చెందారు. తమ పౌరులపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిం చిన ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజాను మరుభూమిగా మారుస్తోంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ చర్చలు ముందుకుసాగడం లేదు. ఈ పరిస్థితుల్లో హమాస్ కీలక రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్ హయ్యా సంచలన ప్రతిపాదనలు చేశారు. 1967కు ముందునాటి సరిహద్దులతో పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడుతామన్నారు. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం సంధికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా గాజా, వెస్ట్ బ్యాంకులో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌లో చేరాలని భావిస్తున్నట్లు చెప్పారు. ‘ఇజ్రాయెల్ 20 శాతమే మమ్మల్ని దెబ్బ తీయగలిగింది. యుద్ధం ముగిస్తుందని హామీ ఇవ్వకుంటే బందీలను ఎలా విడుదల చేస్తాం. హమాస్‌ను అంతం చేయకపోతే పరిస్థితి ఏంటి?’ అని ఖలీల్ తెలిపారు. మరోవైపు రెండు దేశాల ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యతిరేకిస్తున్నారు. 

రఫాపై దాడిని కొనసాగిస్తాం..

హమాస్ లక్ష్యంగా దక్షిణ గాజాలోని రఫా నగరంపై ప్రణాళికబద్ధమైన గ్రౌండ్ ఆపరేషన్‌తో ముందుకు సాగుతామని ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. రఫాలోని పాలస్తీనియన్లకు పునరావాసం ఏర్పాటు చేసేందుకు పెద్ద సంఖ్యలో టెంట్లను పంపిస్తామని తెలిపారు. రఫాలో పదాతి దళాలు అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని ఇప్పటికే నెతన్యాహు పలుసార్లు ప్రకటించారు. హమాస్‌లోని నాలుగు బెటాలియన్లకు రఫా నగరం ఆశ్రయంగా ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అయితే దీనిపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా అల్‌సిసి తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. రఫాలో సైని క చర్య చేపడితే తీవ్ర సంక్షోభం ఏర్పడుతుందని, ప్రాంతీయ శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. రఫాపై ఆపరేషన్‌ను పక్కనబెట్టాలని, ఇతర మార్గాల్లో హమాస్ ఫైటర్లను ఎదుర్కోవాలని అమెరికా సైతం ఇజ్రాయెల్‌కు సూచించింది.   

ఉక్రెయిన్‌కు ఆయుధాలు

ఇజ్రాయెల్, ఉక్రెయిన్, తైవాన్, ఇండో పసిఫిక్ భద్రత కోసం రూ.8 లక్షల కోట్లు (95.3 బిలియన్ డాలర్లు) కేటాయించే బిల్లుకు అమెరికా సెనెట్ మంగళవారం రాత్రి ఆమోదం తెలిపింది. ఇప్పటికే ప్రతినిధుల సభ ఆమోదం తెలిపిన ఈ బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం సంతకం చేశారు. ఇజ్రాయెల్, ఇండో పసిఫిక్ స్థిరత్వానికి కూడా ఈ బిల్లు కీలకమని చెప్పారు. ఈ ప్యాకేజీలో 63.7 శాతం ఉక్రెయిన్‌కు, 27.7 శాతం ఇజ్రాయెల్‌కు, 8.5 శాతం తైవాన్, ఇండో పసిఫిక్ ప్రాంతానికి సాయం అందనుంది. తైవాన్‌కు సాయం అందించటంపై స్పందించిన చైనా.. ఇది ఒకే చైనా విధానానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేసింది.