మహిళా మంత్రిపై లైంగిక దాడి

06-05-2024 12:19:22 AM

ఆస్ట్రేలియాలో ఘటన

న్యూఢిల్లీ, మే 5: సాక్షాత్తు ఓ మహిళా ప్రజాప్రతినిధిపైనే లైంగిక దాడి జరగడం ఆస్ట్రేలియాలో సంచలనంగా మారింది. తనను అపహరించి, డ్రగ్స్ ఇచ్చి రాత్రంతా నరకం చూపించారని 37 ఏళ్ల క్వీన్స్‌లాండ్ ఎంపీ, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి బ్రిట్నీ లౌగా ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. తన నియోజకవర్గంలోని యెప్పూన్‌లో ఏప్రిల్ 28న ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. మంత్రి అయిన తనకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన గత వారం చోటుచేసుకోగా ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.  ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల కోసం ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్య నివేదికలో తన శరీరంలో డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, కానీ తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని ఎంపీ ఇన్‌స్టాలో తెలిపారు. ఈ ఘటనపై క్వీన్స్‌లాండ్ పోలీసు అధికారులు స్పందిస్తూ.. యెప్పూన్‌లో మంత్రిపై జరిగిన లైంగిక దాడి కేసులో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఘటనపై క్వీన్స్‌లాండ్ గృహ నిర్మాణ మంత్రి మేఘన్ స్కాన్లాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.