calender_icon.png 25 November, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత వస్త్రాలకు ఆదరణ కల్పించాలి-

25-11-2025 12:00:00 AM

ఖమ్మం, నవంబర్ 24 (విజయ క్రాంతి): చేనేత వస్త్రాలకు ఆదరణ కల్పించేందుకు రూపొందించిన చేనేత లక్ష్మి పొదుపు స్కీంను ప్రజలందరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో చేనేత లక్ష్మీ పథకంపై జిల్లా అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం చేనేత లక్ష్మీ పథకాన్ని అమలు చేస్తూ బట్టల కొనుగోలుకు నెలకు కొంత డబ్బు పొదుపు చేసుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. చేనేత లక్ష్మీ పథకం క్రింద నెలకు 500 రూపాయల చొప్పున 9 నెలల పాటు పొదుపు చేస్తే, ప్రభుత్వం 10వ నెల ముగిసిన తర్వాత 60 శాతం కలిపి టెస్కో షోరూమ్ నుంచి బట్టలు కొనుగోలు చేసే అవకాశం కలుగుతుందని అన్నారు.

టెస్కో షో రూమ్ ద్వారా బట్టలు కొనుగోలు చేయడం వల్ల చేనేత కార్మికులకు ఎంతో మేలు చేయగలుగుతామని అన్నారు. ఆసక్తి గల జిల్లా అధికారులు, సిబ్బంది టెస్కో అందించే చేనేత లక్ష్మీ పథకాన్నివినియోగించుకొని నాణ్యమైన బట్టలను కొనుగోలు చేయాలని అన్నారు. టెస్కో షో రూమ్ ఖమ్మం నగరం కస్బా బజార్ జివి మాల్ వెనక ఉందని, ఉద్యోగులు, ప్రజలు సందర్శించి చేనేత లక్ష్మీ స్కీంలో చేరేందుకు అసక్తి చూపాలని కలెక్టర్ కోరారు.

ఈ సందర్భంగా హ్యాండ్లూమ్స్ ఏడి, టెస్కో డివిజనల్ మార్కెటింగ్ అధికారి వెంకటేశ్వర్లు చేనేత లక్ష్మీ పథకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ ఏ. పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఆర్డిఓ సన్యాసయ్య, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ యం.అపూర్వ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాసరావు,మేనేజర్ సంతోష్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ జరీన, ప్రతినిధులు ఎల్లా స్వామి, తదితరులుపాల్గొన్నారు.