24-11-2025 12:39:49 AM
మరిపెడ, నవంబర్ 24 (విజయక్రాంతి): నూరు శాతం గిరిజనులు ఉన్న పంచాయితీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల సీట్లను పూర్తిగా గిరిజనులకు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త జాదవ్ రమేష్ నాయక్ అన్నారు. డోర్నకల్ నియోజకవర్గ స్థాయి లంబాడీల ఐక్య వేదిక నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి జాదవ్ రమేష్ నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు భూక్య ప్రవీణ్ నాయక్ అలియాస్ భూక్య మంగ్యా నాయక్ 16 వ వర్ధంతిని ఈ నెలలో మహబూబాబాద్ జిల్లా మరిపెడలో నిర్వహించాలని తీర్మానించారు. లంబాడీల ఐక్య వేదిక స్థానిక సంస్థలపై అలుపెరుగని పోరాటాన్ని చేస్తూ మా తండాలలో మా రాజ్యం పేరిట తెచ్చుకున్న తండా పంచాయతీలలో కేవలం గిరిజన లంబాడీలకే రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల రిజర్వేషన్లలో 50 శాతం కంటే ఎక్కువ లంబాడీలు ఉన్న తండా పంచాయతీలను కూడా లంబాడీలకే కేటాయించాలని లంబాడీల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. 2024 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలనే డిమాండ్ తో లంబాడీల ఐక్యవేదిక ఉద్యమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమన్వయకర్త గూగులోతు దేవేందర్ నాయక్, మండల ఇన్చార్జి దేవేందర్ నాయక్, జిల్లా విద్యార్థి విభాగ సమన్వయకర్త గూగులోత్ బాసు నాయక్ పాల్గొన్నారు.