13-08-2024 03:20:00 AM
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఈ ఏడాది దాదాపు 15.30 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే వ్యవసాయానికి ఎందుకింత గడ్డుకాలమని ప్రశ్నించారు. కేసీఆర్ పదేళ్లలో పాలన వ్యవసాయానికి స్వర్ణయుగమని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సాగు విస్తీర్ణం ఒక్కసారిగా ఎందుకు పడిపోయిందని నిలదీశారు.
ఒక్క ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గటం ఆగమైతున్న రైతు బతుకుకు తొలి ప్రమాద హెచ్చరికని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంలోనే దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో 8 నెలల్లోనే ఎందుకింత వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందో చెప్పాలన్నారు. ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని, ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం సచివాలయం గేటు దాటటం లేదని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్, రిజర్వాయ ర్లు నింపే ప్రణాళిక, చెరువులకు నీళ్లు మళ్లించే తెలివి లేదని మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసానే లేదన్నారు. నిన్న వ్యవసాయానికి కరెంట్ కట్, నేడు రుణ మాఫీలో రైతుల సంఖ్య కట్ చేశారని, సాగయ్యే భూమి విస్తీర్ణాన్ని కూడా కట్ చేసే పరిస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ అని మభ్యపెట్టి పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడంతో రైతులకు ఈ అవస్థ ఏర్పడిందని ఆరోపించారు. రైతులకు రూ.500 బోనస్ అని హామీ ఇచ్చి నిలువునా కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ధ్వజమెత్తారు.
మళ్లీ ఆనాటి పరిస్థితులు
ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారటం ఆందోళన కలిగిస్తోందన్నారు. బురద రాజకీయాలు తప్ప సమయానికి సాగు నీళ్లిచ్చే ఆలోచన సీఎం రేవంత్‌కి లేదన్నారు. ఎరువులు, -విత్తనాల కోసం రైతులకు తిప్పలు, క్యూలైన్‌లో పాసుబుక్కులు, చెప్పులు పెట్టే ఆనాటి పరిస్థితి మళ్లీ తెచ్చారన్నారు. కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దే పగ లూ రాత్రి తేడా లేకుండా పడిగాపులు, అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పారు. కౌలు రైతుల బలవన్మరణాలు కూడా ఆందోళన కలిగిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ లేక రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోలేని చేతగాని తనం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుంకిశాల సంగతేంటి?
సుంకిశాల ప్రాజెక్ట్‌లో ప్రహరీ గోడ కూలిన ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ప్రమాదం జరిగి 10 రోజులు గడిచినప్పటికీ ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రమాదానికి కాంట్రాక్ట్ సంస్థ కారణమైతే ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి ప్రమాదంపై జ్యుడీషియల్ ఎంక్వురై వేయాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరారు. కానీ ప్రభుత్వం ఈ విషయంలో బీఆర్‌ఎస్‌పైనే ఆరోపణలు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. దీంతో నేరుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఈ అంశంపై ప్రశ్నించారు. ప్రమాదం జరిగి 10 రోజులైనా కాంట్రాక్ట్ ఏజెన్సీ మెఘా సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీ పట్ల ఎందుకు మెతక వైఖరితో వ్యవహరిస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కళాశాలలో ట్రైనీ డాక్టర్‌ను అత్యాచారం, హత్య సంఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కేటీఆర్ తెలిపారు. ఆసుపత్రిలో డాక్టర్లు సురక్షితంగా ఉండకపోతే మన ఆడపిల్లలు ఇంకెక్కడ క్షేమంగా ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇంత క్రూరమైన ఘటనకు పాల్పడిన వారిని వదిలి పెట్టకూడదన్నారు. బెంగాల్‌లోని మమతా సర్కార్ నేరస్థున్ని పట్టుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. నిరసన తెలుపుతున్న డాక్టర్లకు కేటీఆర్ సంఘీభావం తెలిపారు.