calender_icon.png 14 September, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల చదువు పట్ల శ్రద్ధ లేదా..?: హరీష్ రావు

14-09-2025 03:10:37 PM

హైదరాబాద్: ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(BRS MLA Harish Rao) ధ్వజమెత్తారు. రెండేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయట్లేదని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్‌ విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి వచ్చిందని హరీష్ రావు ఆరోపించారుదాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచారంగా మారిందని.. విద్యా సంస్థలు బంద్ ప్రకటించినప్పటికీ సీఎం రేవంత్(CM Revanth Reddy) నోరు మెదపట్లేదని విరుచుకుపడ్డారు. టెండర్లు పిలిచేందుకు ఉన్న డబ్బులు.. బకాయిలు చెల్లించేందుకు లేవా..? అని మండిపడ్డారు. కమిషన్ల కోసమే టెండర్లు పిలుస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఫీజు రీయింబర్స్ ఇవ్వడానికి లేని డబ్బులు ముఖ్యమంత్రి కమిషన్ల ప్రాజెక్టులకు ఎలా వస్తున్నాయి..? ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు డిఏలు ఇవ్వమంటే 'నన్ను కోసుకొని తిన్న పైసలు లేవు' అని చెప్పిన ముఖ్యమంత్రి లక్షల కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నాడు..? అని మండిపడ్డారు. కమిషన్లు దండుకునేందుకు రెండున్నర లక్షల కోట్లకు టెండర్లు పిలుస్తున్న రేవంత్ రెడ్డి.. విద్యార్థుల చదువు పట్ల నీకు శ్రద్ధ లేదా? విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల ఆలోచన లేదా..? అని పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలో విద్యావ్యవస్థను బ్రష్టు పట్టించిన విద్యా శాఖ మంత్రి, ముఖ్యమంత్రిగా నువ్వు చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు.