14-09-2025 04:07:18 PM
హైదరాబాద్: బోయిన్‌పల్లిలోని మేధా పాఠశాల(Medha School)ను అధికారులు ఆదివారం సీజ్ చేశారు. ఆల్ఫాజోలం తయారీ కేసులో పాఠశాలను సీజ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం మేధా పాఠశాలలో మత్తుపదార్థాల తయారీని అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. మేధా పాఠశాలకు ఉన్న అనుమతులను కూడా విద్యశాఖ రద్దు చేసింది. మేధా స్కూల్ విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, బోయిన్‌పల్లిలోని మేధా పాఠశాలలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ, ఈగల్ టీంకు పక్కా సమాచారం అందింది. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలు, రసాయనాల వాసన వస్తున్నట్లు స్థానికులు చెపుతున్నారు. ఈ సమాచారం ఆధారంగా శనివారం ఈగల్ టీం ఆకస్మిక దాడి చేసింది. అధికారులు లోపలికి ప్రవేశించగానే నిర్వాహకులు షాక్ కు గురయ్యారు. స్కూల్ మొదటి అంతస్తులో ఒకవైపు పిల్లల పుస్తకాలు, పాఠశాల సామగ్రి ఉండగా, పక్కనే ఎనిమిది పెద్ద రియాక్టర్లు, భారీగా రసాయనాలు, ఇతర తయారీ యంత్రాలు, మత్తు పదార్థాలు నిల్వ చేయబడి ఉన్నాయి. ఇది పాఠశాలను కాకుండా, ఒక పూర్తిస్థాయి డ్రగ్ ఫ్యాక్టరీని తలపించేలా ఉందని అధికారులు నిర్ధారించారు.