14-09-2025 03:52:09 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం డ్రగ్స్ కేంద్రాలు, ముఠాలు వివిధ విభాగాలపై ఈగల్(Eagle), జీఆర్పీ, పోలీసుల దాడులు నిర్వహించారు. రాష్ట్రంలోని రైల్వే స్టేషన్ లు, పారిశ్రామిక వాడల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)లో 91 కిలోల గంజాయిని పట్టుకున్నారు. రైళ్లలో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు రైలులో గంజాయి తరలిస్తున్న మరో ముగ్గురు అరెస్టు చేసి.. ఐదు కిలోల గంజాయిని స్వాధీనపరచుకున్నారు.
వరంగల్ లోని కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో 32 కిలోల గంజాయిని పట్టుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. మొత్తంగా వరంగల్ జిల్లాలో 214 కిలోల గంజాయిని పట్టుకొని సరఫరాదారులను అరెస్టు చేశారు. అలాగే ములుగు జిల్లాలోని వాజేడులో 30 కిలోల గంజాయిని పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లాలో అల్పజోలం తయారీ యూనిట్ ను గుట్టురట్టు చేశారు. ఈ తయారీ యూనిట్ లో 270 గ్రాముల అల్పజోలం, 7.890 కిలోల నోర్డాజీపమ్ ను స్వాధీనపరచుకున్నారు. అలాగే రూ. 16.31 లక్షల విలువైన డ్రగ్స్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.