calender_icon.png 22 January, 2026 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండ మెలిగె.. మేడారం వెలిగె!

22-01-2026 03:32:51 AM

  1. సమ్మక్క సారలమ్మ జాతరకు అంకురార్పణ 
  2. కొనసాగుతున్న భక్తుల రద్దీ

మేడారం, జనవరి 21 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు బుధవారం పూజారులు నిర్వహించిన మండ మెలిగే వేడుకతో అంకురార్పణ జరిగింది. మేడారం, కన్నెపల్లి గ్రామాల్లో మండ మెలిగే పండగ వేడుకల సందర్భంగా పూజారులు నిష్టతో గ్రామంలోని తమ ఇళ్లను శుద్ధిచేసి, వన దేవతలకు కోట్లాదిమంది దిష్టి తగలకుండా ఉండేందుకు గ్రామదేవతలకు పూజలు నిర్వహించారు. అలాగే గ్రామ పొలిమేరలు మామిడి తోరణాలతో అలంకరించారు. దుష్టశక్తులు దూరంగా ఉండేందుకు ప్రత్యేకంగా ‘కట్టడి’ పూజలు నిర్వహించారు.

నియమనిష్టలతో ఆదిపరాశక్తి రూపాన్ని ఆవాహనం చేసుకోవడానికి, జాతర సజావుగా నిర్వహించడానికి మండమెలిగే పండగ నిర్వహించడం జరుగుతుందని ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కుమార్ తెలిపారు. ఆదివాసి సంస్కృతి, సంప్రదాయా లకు అనుగుణంగా డోలు వాయిద్యాలతో  మండ మెలిగే వేడుకను నిర్వహించారు. కన్నేపల్లి సారలమ్మ గుడి, మేడారం సమ్మక్క గుడిని శుద్ధి చేసిన అనంతరం ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దారు. మేడారం మహా జాతరకు మండమెలిగే పండగ అంకురార్పణగా చెప్పారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఈనెల 28 నుండి 31 వరకు జరుగుతుండగా, మేడారం జాతర ముందుగానే భక్తులు పెద్ద ఎత్తున ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి తరలి వస్తున్నారు. బుధవారం భక్తుల రద్దీ కొనసాగింది. 

జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు 

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కు తెలంగాణ రాష్ట్రంలోని 54 ప్రదేశాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక ఎక్స్ప్రెస్ బస్సులను నడపనుంది. 4 వేల బస్సులను నడుపుతున్నట్లు, సుమారు 30 లక్షల మంది భక్తులు ఆర్టీసీ ద్వారా ప్రయాణం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మేడారంలో 50 ఎకరాల్లో ప్రత్యేక బస్టాండు ఏర్పాటు చేశామని, తిరుగు ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా క్యూలైన్, వసతి సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి మేడారం వెళ్లే ఆర్టీసీ ప్రత్యేక ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఇక ఆరు ప్రదేశాల నుండి సెమీ డీలక్స్, 14 ప్రదేశాల నుండి డీలక్స్, 11 ప్రదేశాల నుండి సుపర్ లగ్జరీ, 8 ప్రదేశాల నుండి  రాజధాని, 6 ప్రదేశాల నుండి గరుడ సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. నిబంధ నల మేరకు ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జి వసూలు చేయనున్నారు.

వాట్సాప్ ద్వారా మేడారం విశేషాలు 

మేడారం జాతర విశేషాలను, సేవలను భక్తులకు మరింత అందుబాటులోకి తేవడానికి ఈసారి ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 76589 12300 నెంబర్ కు ‘Hi’ అని మెసేజ్ పంపితే మేడారం జాతర ఉత్సవ విశేషాలు, రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్డేట్స్, పార్కింగ్, వైద్య కేంద్రాలు, స్నాన ఘట్టాలు, ఇతర వివరాలు సెల్ ఫోన్లో చూసుకోవచ్చు.