17-01-2026 03:08:30 PM
హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే మా ఏడవ గ్యారంటీ అని చెప్పిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తూ నిరంకుశత్వమే మా పాలసీ అని నిరూపిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) ఆరోపించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్టు చేయడం హేయమైన చర్యగా అన్నారు.
ఈ అరెస్టులను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడం సిగ్గుచేటని మండిపడ్డారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని అడ్డుకోవద్దని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్న హరీశ్ రావు మీ నిర్బంధాలకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. చారిత్రక సికింద్రాబాద్ అస్తిత్వం కోసం మా పోరాటం ఆగదని వెల్లడించారు.