11-07-2025 12:00:00 AM
మహబూబాబాద్, జూలై 10 (విజయక్రాంతి): నవమాసాలు మోసి, కని పెంచి పెద్ద చేసిన నలుగురు కొడుకులు తనను బతికున్నంత కాలం కంటికి రెప్పలా కాపాడుకుంటారని భావించిన ఆ తల్లిని.. అవసాన దశలో వీధిలో వదిలేశారు. దీంతో ఆ తల్లి రైతువేదికలో తలదాచుకుంటున్నది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన బొడ్డు భద్రమ్మ అనే వృద్ధురాలికి నలుగురు కొడుకులు ఉన్నారు.
అవసాన దశలో ఉన్న భద్రమ్మను నలుగురు కొడుకులు తల నెల పోషించాలని పెద్దలు నిర్ణయించారు. కొంతకాలం పాటు భద్రమ్మ కొడుకులు వెంకన్న, సుధాకర్, రమేష్, యాకస్వామి తల్లిని పోషించినప్పటికీ ఇటీవల ఓ కొడుకు తల్లిని మరో కొడుకు కొడుకు ఇంటికి వెళ్లాలని పంపించాడు. అయితే ఆ కొడుకు తల్లిని పోషించలేనంటూ స్థానిక రైతు వేదిక భవనంలో వదిలి వెళ్లిపోయాడు.
దీనితో వృద్ధురాలు భద్రమ్మ వచ్చిపోయే వారికి తన దీనస్థితిని వివరిస్తూ దుఃఖించ సాగింది. రైతు వేదిక భవనం వరండా పక్కన వృద్ధురాలు భద్రమ్మ దీనస్థితిని చూసి గ్రామస్థులు చలించిపోయారు. అధికారులు స్పందించి తల్లిని నిరాదరణకు గురి చేసిన కొడుకులపై చర్యలు తీసుకుని ఆమెకు న్యాయం చేయాలని కోరుతున్నారు.