15-10-2025 12:15:17 AM
కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, అక్టోబరు 14 (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో ‘ఆరోగ్య మహిళ‘ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్న ఉచిత వైద్య పరీక్షలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం నగరంలోని సప్తగిరి కాలనీ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తుల వివరాలను పక్కాగా నమోదు చేసి వారికి ప్రతి నెలా మందులు అందజేయాలనీ అన్నారు.
ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపులలో రీస్క్రీనింగ్ పూర్తి చేయాలన్నారు. గర్భిణీలకు సిజేరియన్ కాన్పు వల్ల కలిగే సమస్యలను వివరించి సాధారణ డెలివరీలకు ప్రోత్సహించాలన్నారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా బరువు తూస్తూ హేమోగ్లోబిన్ పరీక్ష చేయాలన్నారు. హెచ్ బి తక్కువ ఉన్న మహిళలకు ఐరన్ మాత్రలు అందజేయడంతో పాటు పోషకాహారం సూచించాలని తెలిపారు. అనంతరం ఆరోగ్య మహిళ పరీక్షల్లో భాగంగా ఈ ఆరోగ్య కేంద్రం ఆవరణలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ వాహనంలో 2డి ఎకో, ఎక్సరే, మమ్మోగ్రఫి పరీక్షల తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సనా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.